సరైన ప్రయత్నం, బుద్ధిపూర్వకత మరియు ఏకాగ్రత

వివరణ

మనం మూడు శిక్షణలను మరియు ఎనిమిది రకాల మార్గాలను అభ్యసించి అవి మన జీవితంలో మనకు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాము. అవి:

  • నైతిక క్రమశిక్షణ 
  • ఏకాగ్రత 
  • విచక్షణా అవగాహన.

నైతిక క్రమశిక్షణను పెంపొందించడానికి మనం సరిగ్గా మాట్లాడటం, పని, ప్రవర్తన మరియు జీవనోపాధిని అనుసరిస్తాము. ఇప్పుడు మనం ఏకాగ్రతలో శిక్షణను తెలుసుకోవచ్చు, దీనికి సరైన ప్రయత్నం, బుద్ధిపూర్వకత మరియు ఏకాగ్రత.

సరైన ప్రయత్నం అంటే వినాశకరమైన ఆలోచనలను వదిలించుకోవడం మరియు ధ్యానం కోసం అనుకూలమైన మానసిక స్థితిని అభివృద్ధి చేసుకోవడం.

బుద్ధిపూర్వకత అనేది ఒక్క దానికే కట్టుబడి ఉండే మానసిక జిగురు, కాబట్టి ఇది దేనినీ మర్చిపోకుండా ఉండేలా చూసుకుంటుంది:

  • మన శరీరం, భావాలు, మనస్సు మరియు మానసిక కారణాల యొక్క వాస్తవ స్వభావాన్ని మరచిపోకుండా ఉంటే అవి మన దృష్టిని ఎటూ  మరల్చలేవు. 
  • మన వివిధ నైతిక మార్గదర్శకాలు, నియమాలు లేదా మనం తీసుకున్న ప్రతిజ్ఞలను మర్చిపోకుండా చేస్తుంది.
  • దృష్టి పెట్టిన విషయాన్ని విడిచి పెట్టకపోవడం లేదా మరచిపోకుండా ఉండడం.  

కాబట్టి, మనం ధ్యానం చేస్తుంటే, మనం దృష్టి పెట్టిన దాన్ని మర్చిపోకుండా ఉండటానికి మనకు బుద్ధిపూర్వకత అనేది చాలా అవసరం. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి పైన మరియు అతను ఏమి మాట్లాడుతున్నాడు అనే దానిపై మనం దృష్టి పెట్టాలి.

ఏకాగ్రత అనేది దృష్టి పెట్టిన దానిపై ఉండే ఖచ్చితమైన ఆలోచన. కాబట్టి, మనం ఎవరైనా చెప్పేది వింటున్నప్పుడు, వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అనే వాటిపై మన ఏకాగ్రత ఉండాలి. బుద్ధిపూర్వకత ఏకాగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది, ఇది మానసిక జిగురుగా ఉంటుంది, కాబట్టి అప్పుడు మనం నీరసంగా లేదా వేరే వాటి గురించి ఆలోచించకుండా ఉంటాము.

ప్రయత్నం

ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి మనం ఉపయోగించే ఎనిమిది రకాల మార్గాలలో ఇది మొదటిది. ఏకాగ్రతకు అనుకూలంగా లేని దృష్టి మరల్చే ఆలోచనలు, భావోద్వేగ స్థితులను వదిలించుకోవడానికి, అలాగే మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి మనం బాగా ప్రయత్నిస్తాం. సాధారణంగా మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది. మనకు కావలసినవి ఎక్కడి నుంచో వాటికవే వచ్చి పడవు, ఇది సులభం అని ఎవరూ చెప్పలేదు. కానీ, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాము, మాట్లాడతాము మరియు వ్యవహరిస్తాము అనే విషయంలో నైతిక క్రమశిక్షణతో పనిచేయడం ద్వారా మనం కొంచెం బలాన్ని పెంపొందించుకుంటే, అది మన మానసిక మరియు భావోద్వేగ పరిస్థితులపై పనిచేయడానికి సహాయపడుతుంది.

తప్పు ప్రయత్నం

తప్పు ప్రయత్నం లేదా తప్పు పనులు చెయ్యడం మన శక్తిని హానికరమైన, వినాశకరమైన ఆలోచనా మార్గాల్లోకి తీసుకెళ్తుంది, ఇది మన దృష్టిని మరల్చి ఏకాగ్రతను చెడగొడుతుంది. వినాశకర ఆలోచనా విధానాలలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి:

  • అత్యాశతో ఆలోచించడం
  • దురుద్దేశంతో ఆలోచించడం
  • వైరుధ్యంతో వికృతంగా ఆలోచించడం. 

అత్యాశతో ఆలోచించడం

అత్యాశతో ఆలోచించడం అంటే ఇతరులు సాధించిన దానిని, అనుభవించే ఆనందాలను మరియు వాళ్లకు ఉన్న వస్తువులను చూసి అసూయపడటం. "నేను వాటన్నిటినీ ఎలా పొందగలను?" అని అనుకోవడం. ఇది వాటిని ఇష్టపడటం నుంచి వస్తుంది. మన దగ్గర లేనివి వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది చూసి మనం తట్టుకోలేము, అది లైఫ్ లో సక్సెస్ కావచ్చు, ఒక అందమైన పెళ్ళాం కావచ్చు, కొత్త కారు కావచ్చు - నిజానికి, అది ఏదైనా అవ్వొచ్చు. మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. ఇది మనకు చాలా ఇబ్బంది పెట్టే ఒక మానసిక స్థితి. ఇది మన ఏకాగ్రతను పూర్తిగా పోగొడుతుంది, అవునా కాదా?

పరిపూర్ణత అనేది దీని కిందకు వస్తుంది - మనల్ని మనం ఎలా అధిగమించగలమో మనకు తెలుసు. ఇది దాదాపు వాళ్లపై అసూయ పడటమే!

దురుద్దేశంతో ఆలోచించడం

దురుద్దేశంతో ఆలోచించడం అంటే ఒకరికి ఎలా హాని చేయాలనే అనే ఆలోచన. "ఈ వ్యక్తి నాకు నచ్చనిది చెప్పినా లేదా చేసినా, నేను అతనికి చెడు చేస్తాను" అని అనుకోవడం. ఇంకొక సారి ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం ఏమి అనాలో అని ఆలోచిస్తాం, ఒకవేళ వాళ్లు మనల్ని ఏమైనా అని మనం తిరిగి వాళ్లను తిట్టకపోతే మనం బాధపడతాం. ఈ విషయాన్ని ఇంక మరచిపోలేము, దాని గురించి బాగా ఆలోచిస్తాం.

వైరుధ్యంతో వికృతంగా ఆలోచించడం

ఉదాహరణకు, ఎవరైనా కష్టపడి పని చేస్తుంటే లేదా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే, మనం, " వాళ్లు మూర్ఖులు - వాళ్లు చేసే పనికి ఏ ఉపయోగం లేదు. పక్కన వాళ్లకు ఎందుకు అసలు సహాయం చెయ్యటం" అని ఆలోచిస్తాము.

కొంతమంది ఆటలను ఇష్టపడరు. టెలివిజన్ లో ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసే వాళ్లని మరియు ఆటను చూడటానికి వెళ్ళే వాళ్లని మూర్ఖులుగా చూస్తారు. కానీ ఆటలను ఇష్టపడటంలో తప్పేమీ లేదు. అది తెలివితక్కువ పని లేదా టైమ్ వేస్ట్ అని అనుకోవడం చాలా చెడు రకపు మానసిక స్థితి.

లేదా, ఒకడు బిచ్చగాడికి డబ్బు ఇచ్చి సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తారు, అప్పుడు మీరు ఇలా అనుకుంటారు, "ఓహ్, ఆ పని చేసినందుకు నిజంగా నువ్వు మూర్ఖుడివే" అని. ఎదుటి వాళ్ళు ఎంత తెలివితక్కువ వాళ్ళో, వాళ్లు చేసే పని గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే, మనం ఎప్పటికీ ఏకాగ్రతను పొందలేము. మనం విడిచిపెట్టాల్సిన ఆలోచనలు ఇవే.

సరైన ప్రయత్నం

సరైన ప్రయత్నం మన శక్తిని హానికరమైన, వినాశకరమైన ఆలోచనా మార్గాల నుంచి ప్రయోజనకరమైన వాటి వైపు మళ్లించడం. అందుకోసం పాలీలో "నాలుగు సరైన ప్రయత్నాలు" అని పిలువబడే వాటి గురించి మాట్లాడుతాం. సంస్కృతం మరియు టిబెటన్ సాహిత్యంలో, వాటిని ఇబ్బందులను తొలగించే నాలుగు విషయాలుగా పిలుస్తారు, - మరో మాటలో చెప్పాలంటే, మన బాధలను వదిలించుకోవడానికి - వీటిని "నాలుగు స్వచ్ఛమైన పరిత్యాగాలు" అని పిలుస్తారు:

  1. ముందుగా, మనకు తెలియని నెగెటివ్ లక్షణాలు రాకుండా నిరోధించడానికి కష్టపడతాము. ఉదాహరణకు, మనకు చాలా వ్యసనపరుడయ్యే వ్యక్తిత్వం ఉంటే, మనం ఒక ఆన్‌లైన్ మూవీ స్ట్రీమింగ్ సేవలో చేరకుండా ఉండాలనుకోవచ్చు, ఎక్కడైతే మీరు రోజంతా సిరీస్ లు చూసుకుంటూ గడుపుతారో. ఇది చాలా హానికరంగా ఉంటుంది మరియు ఏకాగ్రత కోల్పోవటానికి దారితీస్తుంది.
  2. అప్పుడు, మనలో ఇంతకుముందు నుంచే ఉన్న నెగెటివ్ లక్షణాలను వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి, మనం దేనికైనా అడిక్ట్ అయితే, దానిని లిమిట్ చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, కొంతమంది తమ ఐపోడ్ కి ఎంతలా బానిసలయ్యారో మనందరికీ తెలుసు, వాళ్ళు మ్యూజిక్ వినకుండా ఎక్కడికీ వెళ్ళలేరు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉండటానికి భయపడతారు, దేని గురించి అయినా ఆలోచించడానికి భయపడుతారు, కాబట్టి వాళ్ళు ఎప్పుడూ మ్యూజిక్ ని వింటూనే ఉంటారు. నిజానికి, ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి లేదా వ్యాయామం చేసేటప్పుడు మంచి మ్యూజిక్ ఉపయోగపడుతుంది. పని చేసేటప్పుడు కూడా ఇది బాగానే సహాయపడుతుంది. కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మ్యూజిక్ అనేది అస్సలు అవసరం లేదు. ఇది దృష్టి పోయేలా చేస్తుంది.
  3. దీని తర్వాత, మనం కొత్త పాజిటివ్ లక్షణాలను పెంపొందించుకోవాలి.
  4. అప్పుడు, మనకు ఇంతకుముందు నుంచే ఉన్న పాజిటివ్ లక్షణాలను మెయింటైన్‌ చెయ్యడానికి మరియు వాటిని పెంపొందించుకోవడానికి ఇంకా కష్టపడతాము.

వీటిని చూసి ఆచరణాత్మక ఉపయోగాలను కనిపెట్టడం చాలా మంచి విషయం. ఒక ఉదాహరణ ఏమిటంటే నాకు ఉన్న ఒక వెబ్‌సైట్ విషయానికి వస్తే నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని కోసం దాదాపు 110 మంది పనిచేస్తున్నారు, వారి అనువాదాలు మరియు ఎడిట్ చేసిన ఫైళ్లతో నాకు ఎప్పుడూ ఇమెయిల్స్ పంపుతూ ఉంటారు – నాకు ప్రతిరోజూ చాలానే వస్తూ ఉంటాయి. నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏమిటంటే, నేను మరియు నా అసిస్టెంట్ వాటిని సరైన ఫోల్డర్లలో ఫైల్ చేయకుండా, వాటన్నిటినీ ఒకే ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేశాము. ఇది నిజంగా ఒక చెడ్డ అలవాటు, ఎందుకంటే మా ఈ అసమర్థత వల్ల ఆ ఫైళ్లను సరిగ్గా కనిపెట్టలేక అన్ని చోట్లా వెతుకుతూ చాలా టైమ్ వృధా చేసి పనిపై దృష్టి పెట్టకుండా చేసింది. కాబట్టి, ఇక్కడ ఏ మంచి పని చెయ్యాలి? ఏదైనా ఇమెయిల్ వచ్చిన వెంటనే అది వెంటనే సరైన ఫోల్డర్ లోకి వెళ్లేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది బద్ధకంగా ఏ పని చేయనివ్వకుండా ఉండకుండా, సరిగ్గా మెయింటైన్ చేసే అలవాటుని పెంచుతుంది.

ఈ ఉదాహరణలో, మనం ఒక నెగెటివ్ క్వాలిటీ, మరియు ఒక పాజిటివ్ క్వాలిటీని కనిపెట్టగలిగాము. అందుకని, మనం ఒక నెగెటివ్ క్వాలిటీని వదిలించుకోవడానికి మరియు సరైన ఫైల్ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నిస్తాము. దీని గురించే మనం చాలా సింపుల్ గా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం.

ఏకాగ్రతకు అడ్డుగా ఉండే ఐదింటిని అధిగమించడం

సరైన ప్రయత్నంలో ఏకాగ్రతకు ఐదు అడ్డంకులను అధిగమించడానికి పనిచేయడం గురించి కూడా ఉంటుంది, అవి:

ఐదు రకాల వాంఛనీయ ఇంద్రియాలలో దేనినైనా అనుసరించే ఉద్దేశాలు:

ఐదు రకాల వాంఛనీయ ఇంద్రియాలు అందమైన దృశ్యాలు, శబ్దాలు, పరిమళాలు, అభిరుచులు మరియు శారీరక అనుభూతులు. మనం వీటిని అధిగమించడానికి ప్రయత్నించే అడ్డంకి, మనం దేనిపైనైనా దృష్టి పెట్టడానికి ప్రయత్నించడం. ఉదాహరణకు మన పని. మన ఏకాగ్రత వల్ల మన దృష్టి మళ్లుతుంది, అంటే "నేను సినిమా చూడాలనుకుంటున్నాను" లేదా "నేను ఫ్రిజ్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాను" అనే ఆలోచనలు. కాబట్టి ఇక్కడ మనం తినాలని కోరుకోవడం, సంగీతం వినడం వంటి ఇంద్రియ ఆనందాలు లేదా కోరికల గురించి ఆలోచిస్తున్నాము. ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం వాటిని అనుసరించకుండా ఉండటానికి ప్రయత్నించాలి, అప్పుడే మనం ఏకాగ్రతతో ఉంటాము.

చెడు ఆలోచనలు

ఇవి ఎవరినైనా బాధపెట్టాలనే ఆలోచనలు. "ఈ వ్యక్తి నన్ను బాధపెట్టాడు, నాకు అది నచ్చలేదు, నేను వాడి మీద ఎలా ప్రతీకారం తీర్చుకోగలను" అని మనం ఎప్పుడూ చెడ్డగా ఆలోచిస్తూ ఉంటాము. ఇది ఏకాగ్రతకు పెద్ద అడ్డుగా ఉంటుంది. ఇతరుల గురించే కాకుండా మన గురించి కూడా చెడు ఆలోచనలను తెచ్చుకోకుండా ఉండటానికి మనం ప్రయత్నించాలి.

మత్తు మరియు మగతగా ఉండడం

ఇక్కడే మన మైండ్ మత్తులో ఉంటుంది, మనకు చికాకుగా ఉండి స్పష్టంగా ఆలోచించలేకపోతాము. మగత అనేది, నిజానికి, మనం నిద్రపోతున్నప్పుడు ఉంటుంది. దీనిని పోగొట్టేందుకు మనం ప్రయత్నించాలి. కాఫీతో తాగి లేదా బయట ఉండే స్వచ్ఛమైన గాలి పీల్చి దాన్ని తప్పించుకోవాలి. కానీ, ఏకాగ్రతతో ఉండడం నిజంగా కష్టంగా మారితే, మనం దానికి ఒక సరిహద్దును అంటే ఒక లిమిట్ లాగా పెట్టుకోవాలి. మీరు ఇంట్లోనే పనిచేస్తుంటే, "నేను ఇరవై నిమిషాలు నిద్రపోతాను లేదా కాసేపు బ్రేక్ తీసుకుంటాను" అని అనుకోవాలి. మీరు మీ ఆఫీసులో ఉంటే, "నేను పది నిమిషాలు కాఫీ బ్రేక్ తీసుకుంటాను." అని ఒక లిమిట్ ని సెట్ చేసుకుని ఆ తర్వాత పనిని మళ్ళీ మొదలుపెట్టాలి.

మనస్సు ఎటో వెళ్లిపోవడం మరియు పశ్చాత్తాపం

మన మనస్సు ఫేస్ బుక్, యూట్యూబ్ లేదా వేరే వాటి వైపు వెళ్లిపోవడం. పశ్చాత్తాపం అనేది మనస్సు అపరాధ భావనకు గురికావడం. "నేను ఇలా లేదా అలా చేసినందుకు చాలా బాధపడ్డాను." ఇవన్నీ నిజంగా మనల్ని ఇబ్బంది పెడతాయి మరియు మన దృష్టిని పాడుచేస్తాయి.

నిర్ణయం తీసుకోలేని స్థితి మరియు సందేహాలు

చివరికి మనం నిర్ణయం తీసుకోలేని స్థితి మరియు సందేహాలను అధిగమించడానికి కష్టపడాలి. "నేను ఏమి చెయ్యాలి?" "నేను లంచ్ కి ఏమి తినాలి? నాకు తినటానికి ఇది ఉంటే బాగుంటుంది. లేదా అది తినాలా?" అని మీ మనస్సును సరిగ్గా సిద్ధం చేసుకోలేకపోతే చాలా సమయం వృధా అయిపోయినట్టే. మనం ఎప్పుడూ సందేహాలు మరియు నిర్ణయాలు తీసుకోవడంలో ఇరుక్కుపోతే, ఏకాగ్రతతో పనులు సరిగ్గా చేయలేము.

సరైన ప్రయత్నం కోసం ఈ క్రింది వాటిని చెయ్యాలి:

  • ఇబ్బంది పెట్టే మరియు విధ్వంసకరమైన ఆలోచనలను నివారించుకోవాలి.
  • మనకున్న చెడు అలవాట్లను, లోపాలను వదిలించుకోవాలి.
  • మనలో ఇప్పటికే ఉన్న మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి మరియు మనలో లోపం ఉన్న వాటిని వదులుకోవాలి.
  • ఏకాగ్రతకు ఉన్న అడ్డంకులను అధిగమించాలి.

బుద్ధిపూర్వకత

ఏకాగ్రతతో ముడిపడి ఉన్న ఈ ఎనిమిది రకాల మార్గాలలో తర్వాతది సరైన బుద్ధిపూర్వకత:

  • బుద్ధిపూర్వకత అనేది ప్రాథమికంగా మనసుకి సంబంధించినది. మీరు ఏకాగ్రతతో ఉన్నప్పుడు, మీ మనస్సు ఒకే విషయాన్ని బాగా ఆలోచిస్తుంది. ఈ బుద్ధిపూర్వకత అనేది మిమ్మల్ని ఆ విషయాన్ని విడిచిపెట్టకుండా చూసుకుంటుంది.
  • ఇది అప్రమత్తంతో ఉంటుంది, ఇది మీ దృష్టి ఎటైనా వెళ్తుందో లేదో లేదా మీరు నిద్రపోతున్నారా లేదా నీరసంగా ఉన్నారా అని గుర్తిస్తుంది.
  • అప్పుడు మనం మన దృష్టిని ఉపయోగిస్తాము, అదే మనం దృష్టి పెట్టే విషయం అని పరిగణిస్తాము.  

ఇక్కడ మనం మన శరీరం, భావాలు, మనస్సు మరియు వివిధ మానసిక విషయాలను ఎలా పరిగణిస్తాము అనే దానిపై దృష్టి పెడతాము. మన శరీరాన్ని మరియు భావాలను తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలని మనం కోరుకుంటాము, ఎందుకంటే మన దృష్టి ఎటైనా వెళ్ళిపోతే అప్పుడు మనం మన ఏకాగ్రతను సాధించలేము. కాబట్టి, ఇప్పుడు, బుద్ధిపూర్వకత యొక్క తప్పైన మరియు సరైన కోణాన్ని తెలుసుకుందాం.

మన శరీరానికి సంబంధించి

మనం శరీరం గురించి మాట్లాడినప్పుడు, సాధారణంగా దీని అర్థం మన శరీరం మరియు మన శరీరంలోని వివిధ శారీరక అనుభూతులు లేదా అంశాల గురించి ఉంటుంది. శరీరం గురించి తప్పుగా భావించడం అంటే, స్వభావ రీత్యా, మన శరీరం ఎప్పుడూ ఆనందాన్ని పొందేదిలా లేదా శుభ్రంగా మరియు అందంగా ఉంటుందని అనుకోవడం. మనం కనిపించే విధానం - మన జుట్టు మరియు మేకప్, మనం ధరించే దుస్తులు మొదలైన వాటి గురించి మనం బాగా ఆలోచించి గంటల కొద్దీ సమయం గడుపుతాము. నిజానికి, దీన్ని శుభ్రంగా మరియు ప్రేసెంటబుల్ గా ఉంచుకోవచ్చు. కానీ శరీరం కనిపించే విధానం ఆనందానికి మూలం అని, అది ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని, అప్పుడే మనం ఇతరులను ఆకర్షించగలమని ఆలోచించే స్థాయికి వెళ్లినప్పుడు, దీనికంటే అర్థవంతమైన దానిపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం మనకు దొరకదు.

శరీరాన్ని రియలిస్టిక్ గా పరిశీలిద్దాం. మీరు ఎక్కువ సేపు కూర్చుంటే, మీరు అసౌకర్యంగా  కదలాల్సి ఉంటుంది. మీరు పడుకుంటే, ఒక వైపు అసౌకర్యంగా ఉంటుంది, మరియు తర్వాత వేరే వైపు తిరిగినా కూడా అలాగే అనిపిస్తుంది. మనకు అనారోగ్యం వస్తుంది; వయసు పెరుగుతూ ఉంటుంది. మనం బాగా తింటూ వ్యాయామం చేస్తూ మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, కానీ దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అనే ఆలోచన విధానం ఒక సమస్యగా మారుతుంది.

ఇలాంటి తప్పు బుద్ధిపూర్వకతను మనం వదిలించుకోవాలి. మన జుట్టు అనేది అత్యంత ముఖ్యమైన విషయం అని, లేదా మనం ఎప్పుడూ దానిని సరైన రంగులో ఉంచుకోవాలి అని మరియు ఇదే మనకు ఆనందాన్ని ఇస్తుంది అనే ఆలోచనను మనం విడిచిపెట్టాలి. మనం దీని గురించి ఆలోచించడం మానేసి, సరైన బుద్ధిని పెంపొందించుకుంటాము, అదే "నా జుట్టు మరియు దుస్తులు నిజంగా నా ఆనందానికి అంతగా అవసరమైనవి కాదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నా సమయం వృధా అవుతుంది మరియు వేరే వాటిపై దృష్టి పెట్టనివ్వదు" అని అనుకుంటాము.

మన భావోద్వేగాలు

ఇక్కడ మనం దుఃఖం లేదా ఆనందం యొక్క భావాల గురించి మాట్లాడుతున్నాము, ఇవి చివరికి బాధతో ముడిపడి ఉంటాయి. మనం సంతోషంగా లేనప్పుడు, మనకు "దాహం" అనేది ఒకటి కలుగుతుంది - ఈ దుఃఖం పోవడం కోసం మనకు దాహం వేస్తుంది. అదే విధంగా, మనకు కొంచెం ఆనందం కలిగినప్పుడు, మనకు ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది. ఇదే ప్రాథమికంగా సమస్యలకు కారణం.

మనం దుఃఖాన్ని ఈ ప్రపంచంలో అత్యంత చెడ్డ విషయంగా భావించినప్పుడు, అది మన ఏకాగ్రతకు సమస్యలను తెచ్చిపెడుతుంది. అది ఎలా? "నాకు కొంచెం అసౌకర్యంగా ఉంది," లేదా "నేను మంచి మూడ్ లో లేను" లేదా "నేను దుఃఖంలో ఉన్నాను," అని. అయితే ఏంటి? నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాన్ని చేస్తూనే ఉండు. నీ ఈ చెడు మానసిక స్థితి ప్రపంచంలోనే ఒక చెత్త విషయం అని అనుకుంటే, నువ్వు చేసే పనిపై దృష్టి పెట్టడానికి ఇది నిజంగానే ఒక అడ్డు.

మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన దృష్టి ఎటూ పోకూడదు, ఆనందం పెరుగుతూ శాశ్వతంగా ఉండాలని కోరుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఇలా జరుగుతుంది. అప్పుడు మీరు నిజంగా మంచి అనుభూతిని పొందుతారు. ఇది ఎంత అద్భుతమైనదో అదే విధంగా మీ దృష్టి మారుతుంది. లేదా మీరు మీకు నచ్చిన వారితో ఉంటే, లేదా రుచికరమైన వాటిని తింటుంటే, "ఇది చాలా అద్భుతమైనది" అని అనుకోవడం మరియు దాని వల్ల దృష్టిని పోగొట్టుకోవడం తప్పు బుద్ధిపూర్వకత. దాని గురించి పెద్దగా ఏమీ ఆలోచించకుండా, అది ఎలా ఉంటే అలాగే ఎంజాయ్ చెయ్యాలి.

మన మనసుకి సంబంధించి

మన మనస్సులో ఏదో లోపం ఉందని భావించి, కోపం లేదా అజ్ఞానం ఉందని భావిస్తే ఏకాగ్రతను సాధించడం కష్టం. మనల్ని మనం చాలా మంచివాళ్లం అని భావిస్తుంటాం: "నేను ఇది కాదు. నేను అది కాదు. నేనేమీ కాదు." లేదా "నేను దేన్నీ అర్థం చేసుకోలేను", ఇలా మనం ప్రయత్నించక ముందే అన్నీ అనేసుకుంటాము. మనం ఈ ఆలోచనల గురించే ఆలోచిస్తే, అది చాలా నిరాశాజనకంగా ఉంటుంది. సరైన బుద్ధిపూర్వకతతో మనం "సరే, ఇప్పుడు ఇది ఏమీ అర్ధం కాకపోయినా, నేనేమీ ఇబ్బంది పడను, కానీ నా మనస్సు యొక్క స్వభావం ఇది కాదు" అని అనుకోవాలి. ఇది పని చేయడానికి ఏకాగ్రతతో మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

మన మానసిక విషయాలకు సంబంధించి

ఈ నాలుగోది తెలివితేటలు, దయ, సహనం లాంటి మన మానసిక విషయాల గురించి ఉంటుంది. తప్పు బుద్ధిపూర్వకత అంటే అవి బాగానే ఉన్నాయని మరియు "నేను ఇలానే ఉంటాను ప్రతి ఒక్కరూ దాన్నే అంగీకరించాలి. వాటిని మార్చడానికి నేను ఇంకేమీ చేయలేను" అని అనుకోవడం. ఈ విషయాలన్నీ అలాగే ఉండవని తెలుసుకోవడం సరైన బుద్ధిపూర్వకత, కానీ ఈ సందర్భంలో, మంచి ఏకాగ్రతతో వీటిని అభివృద్ధి చేసుకోవచ్చు.

మనల్ని మనం నియంత్రించుకోవడం

నిజంగా ఒక చెడ్డ మూడ్ లో ఉండటాన్ని మనం ఎలా డీల్ చేస్తామో అని ఒక విశ్లేషణ చేకున్నప్పుడు, మన మానసిక స్థితి దానిలోనే ఇరుక్కుపోయిందని తెలుస్తుంది, లేదా అపరాధ భావంతో మనం చేసిన తప్పులోనే ఇరుక్కుపోతాం. సరే, మనం మనుషులం, కాబట్టి మనందరం తప్పులు చేస్తాము. తప్పుడు బుద్ధిపూర్వకత అనేది మనం ఒకే విషయాన్ని ఆలోచిస్తూ ఉండిపోవడం, మరియు మనం ఎంత చెడ్డగా భావిస్తున్నామో అని అనుకోవడం. సరైన బుద్ధిపూర్వకత అనేది మన మానసిక స్థితి మారుతుందని తెలుసుకోవడం, ఎందుకంటే అవి కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ఎప్పుడూ మారుతూ ఉంటాయి; ఏదీ శాశ్వతంగా ఒకేలా ఉండదు.

బౌద్ధమత బోధలలో మనకు లభించే ఒక ఉపయోగకరమైన సలహా ఏమిటంటే, ప్రాథమికంగా "మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం." ఇది మీరు పడుకుని ఉదయం లేవడం వంటిది. అప్పుడు మీరు అస్సలు లేవడానికి ఇష్టపడరు ఎందుకంటే అక్కడే మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మీకు నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు మీకు మీరే నిద్ర లేస్తారు, అవునా కాదా? ఆ పని చేసే సామర్ధ్యం మనకు ఉంటుంది, అలా ఉండకపోతే, మనలో సగం మంది అసలు నిద్రే లేవలేరు! అలాగే మనం చెడ్డ మూడ్ లో ఉన్నప్పుడు లేదా కొంచెం బాధలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. మనల్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు - "రండి, అలాగే చేద్దాం!" - దానికి లొంగిపోకుండా ఉందాం.

బుద్ధిపూర్వకత యొక్క ఇతర అంశాలు

సాధారణంగా, బుద్ధిపూర్వకత చాలా ముఖ్యమైనది. ఇది విషయాలను మరచిపోకుండా చేస్తుంది. మనం చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే, సరైన బుద్ధిపూర్వకత అనేది వాటిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. బుద్ధిపూర్వకత గుర్తుంచుకోవడంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి మీకు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ ఈ రోజు రాత్రే ఉందని మనం గుర్తుంచుకుంటాం. కానీ ఇది తక్కువ ముఖ్యమైనది ఉండి మిగతా ముఖ్యమైన విషయాలను మర్చిపోయేలా చేస్తుంది.

మనం ఏదో ఒక రకమైన శిక్షణను అనుసరిస్తే, దాని గురించి ఆలోచించడానికి సరైన బుద్ధిపూర్వకత ఉంటుంది. మనం వ్యాయామం చేస్తుంటే, ప్రతిరోజూ దాన్ని కొనసాగించాలి. మనం డైట్ లో ఉన్నట్లయితే, మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, అప్పుడే మనకు ఎవరన్నా కేక్ ముక్క ఇస్తే తినకుండా ఉంటాం.

బుద్ధిపూర్వకత అంటే మనం ఏమి చేస్తున్నామో దాని గురించి ఆలోచించడం మరియు మిగతా అన్ని విషయాల నుంచి దృష్టి మరల్చుకోకుండా ఉండటం.

మన కుటుంబాలతో ఉన్నప్పుడు బుద్ధిపూర్వకతను మెయింటైన్ చేయడం

స్నేహితులు లేదా తెలియని వాళ్లతో ఉన్నప్పుడు కంటే వారి కుటుంబంతో ఉన్నప్పుడు నైతికత గురించి గుర్తుంచుకోవడం చాలా మందికి చాలా కష్టం. మనకు కూడా అలాగే ఉంటే, ప్రారంభంలో చాలా బలమైన ఉద్దేశ్యాన్ని సెట్ చేసుకోవాలి. మీరు మీ బంధువులను కలవబోతున్నట్లయితే, మీరు, "నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, వాళ్ళు నాతో బాగా ఉండేవారని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాను, వాళ్ళు నాకు దగ్గర వాళ్ళు, మరియు నేను వారితో వ్యవహరించే విధానం వారి భావాలను ప్రభావితం చేస్తుంది." అని అనుకోవాలి. ప్రారంభంలో ఇది చాలా ముఖ్యమైనది.

వాళ్ళు కూడా మనుషులే అని మనం గుర్తు చేసుకోవాలి. తల్లిగా, తండ్రిగా, చెల్లెలా, తమ్ముడు లాంటి అనుబంధంతో వారిని మనం చూడకూడదు. మీరు వారిని ఒక విధంగా చూస్తే, తల్లి లేదా తండ్రి అనే మన అంచనాలతో వాళ్లు ఏమి చేస్తారో అని మనం ప్రతిస్పందిస్తాము. వాళ్లని మనలాగే ఒక మనిషిగా చూడటం మంచిది. వాళ్ళు ఈ విషయాన్ని గమనించి, ఇప్పటికీ మనల్ని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటే, మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్లు మనుషులేనని, ఆటలు ఆడకుండా ఉంటాము. అన్నింటికీ మించి, ఒక టాంగో నృత్యం చేయడానికి ఇద్దరు కావాల్సి ఉంటుంది.

మా అక్క నా దగ్గర ఒక వారం రోజుల పాటు ఉంది. ఆమె రాత్రి చాలా త్వరగా నిద్రపోయేది, తను నా అమ్మలా, నన్ను కూడా "తొందరగా పడుకో" అని చెప్పేది. కానీ నేను ఒక చిన్నపిల్లలాగా , "లేదు, అప్పుడే నాకు నిద్ర పోవాలని లేదు, నేను మేలుకునే ఉండాలనుకుంటున్నాను, నన్ను నిద్రపోమని నువ్వు ఎందుకు చెప్తున్నావు?" అని చెప్పాను. దాంతో మేమిద్దరం గొడవ పడ్డాం. అప్పుడు తను నాకు ఒక సలహా ఇస్తుందని అర్ధం అయ్యింది, ఎందుకంటే తను నన్ను పట్టించుకుంది నా మీద తను ఎలాంటి కోపం తెచ్చుకోలేదు. నేను త్వరగా నిద్రపోవడం మంచిదని తను అనుకుంది. కాబట్టి, మన ఆలోచనలను ప్రొజెక్ట్ చేయడం కంటే, అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు మనం ప్రయత్నించాలి.

కాబట్టి మన౦ కుటు౦బ సభ్యులను ము౦దు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి, అంటే:

  • మన లక్ష్యం: నేను పట్టించుకునే మరియు నన్ను పట్టించుకునే కుటుంబంతో బాగా మాట్లాడాలి.
  • దానితో పాటు వచ్చే భావోద్వేగం: మనుషులుగా మన కుటుంబం గురించి ఆలోచించడం. 

ఇది ఒక భయంకరమైన పరీక్ష అని అనుకునే బదులు, దానిని ఒక సవాలుగా మరియు ఎదగడానికి వచ్చిన అవకాశంగా చూడటం మంచిది: "నేను నా సహనాన్ని కోల్పోకుండా నా కుటుంబంతో భోజనం చెయ్యగలనా?” అని.

మీ కుటుంబం మిమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినప్పుడు, ఇలా అంటూ ఉంటారు, "ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవు? ఎందుకు నువ్వు ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చుకోవు? నువ్వు ఇంకా ఎందుకు పిల్లల్ని కనలేదు?" (నన్ను చూడగానే మా చెల్లెలు చెప్పిన మొదటి మాట "నీకు హెయిర్ కట్ అవసరం!") అప్పుడు అర్ధం అవుతుంది వాళ్ళు మన గురించి పట్టించుకుని ఇలా అడుగుతున్నారని. దానికి మనం సమాధానం ఇలా చెప్పాలి, "నా గురించి పట్టించుకున్నందుకు చాలా థాంక్స్!" అని.

వారు ఏ ఆలోచనతో అంటున్నారో కూడా మనం అర్ధం చేసుకోవచ్చు, అంటే వారి స్నేహితులు చాలా మంది అడుగుతారు, "అవును, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ కూతురు ఏం చేస్తుంది?' అని. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని. ఇదంతా వాళ్ళు భయపెట్టాలని అడగడం లేదు, మీ ఆనందం గురించి ఆలోచించి అడుగుతున్నారు. ఆలా అడిగే వాళ్లని అభినందించడమే మన మొదటి పని. కావాలంటే, మీరు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదో ప్రశాంతంగా వాళ్ళకు వివరించండి!

అనుచిత బుద్ధిపూర్వకతతో, మనం ఎప్పుడూ ఉపయోగం లేని పనులను చేస్తూ ఉంటాము. "పదేళ్ల క్రితం ఎందుకిలా చేసావు?" లేదా "ముప్పై ఏళ్ళ క్రితం ఆ మాట అన్నావు" అని మాట్లాడుతూ ఉంటాము. మనం దాని గురించే ఆలోచిస్తూ ఎవరికీ అవకాశం ఇవ్వము, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే దానిపై దృష్టి పెట్టము. "ఇది భయంకరంగా ఉండబోతోంది" అని అనుకుని మన తల్లిదండ్రులు వస్తున్నారు అని మనం అప్పటికే నిర్ణయించుకుంటాము. డిన్నర్ కు ముందు మనకు టెన్షన్ తెచ్చిపెడుతుంది! కాబట్టి మనం దీన్ని సరైన బుద్ధిపూర్వకతతో హ్యాండిల్ చేస్తాము, ఎలా ఉన్నాయో చూసి ముందస్తు ఆలోచనలు లేకుండా, పరిస్థితికి అనుగుణంగా ప్రతిస్పందించే అవకాశంగా భావిస్తాము.

బుద్ధిపూర్వకత కోసం ఆచరణాత్మక సలహాలు

కష్టమైన పరిస్థితుల్లో మన బుద్ధిపూర్వకతను ఎలా ఉంచుకోవాలి? మనం ఈ క్రింది వాటిని పాటించాలి:

  • ఉద్దేశం - మరచిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలనే బలమైన ఉద్దేశ్యం.
  • పరిచయం - ఒకే పనిని పదే పదే చేసి ఆటోమేటిక్ గా గుర్తుంచుకోవడం. 
  • అప్రమత్తత - మనం బుద్ధిని కోల్పోయినప్పుడు గుర్తించే ఒక అలారం వ్యవస్థ.  

ఇవన్నీ శ్రద్ధ గల వైఖరిపై ఆధారపడి ఉంటాయి, ఇక్కడ మీరు మీపై మరియు ఇతరులపై మీ ప్రవర్తన యొక్క ప్రభావం గురించి శ్రద్ధ వహిస్తారు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో నిజంగా పట్టించుకోకపోతే, అది బుద్ధిపూర్వకతను దెబ్బతీస్తుంది. ఎందుకంటే అక్కడ ఎలాంటి క్రమశిక్షణ ఉండదు. మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే నువ్వు ఒక మనిషివి. మీ అమ్మానాన్నలు మనుషులే. మరియు మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరూ దుఃఖంలో ఉండాలని కోరుకోరు. ఇతరుల పట్ల మన౦ ప్రవర్తి౦చే తీరు, మాట్లాడే విధానం వారి భావాలను ప్రభావిత౦ చేస్తు౦ది, కాబట్టి మన౦ ఎలా ప్రవర్తిస్తామనే దాని గురి౦చి బాగా శ్రద్ధ వహించాలి.

మనల్ని, మన ప్రేరణను పరీక్షించుకోవాలి. మనలాగే ఇతరులు కూడా మంచిగా ఉండాలనుకుంటే అది సిల్లీగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండటానికి మరియు బుద్ధిపూర్వకతను కాపాడుకోవడానికి ఉత్తమ కారణం ఏమిటంటే, శ్రద్ధతో మనం ఇతరులను పట్టించుకుంటాము.

ఏకాగ్రత

ఏకాగ్రత కోసం మనం ఉపయోగించే ఎనిమిది రకాల మార్గాలలోని మూడవ దానిని ఏకాగ్రత అంటారు (అవును, దీనిని ఏకాగ్రత అనే అంటారు). ఏకాగ్రత అనేది ఒక వస్తువుపై మనం నిజంగా తీసుకునే శ్రద్ధ. మనం దేనిపై దృష్టి పెట్టాలనుకుంటున్నామో దానిని సాధించిన తర్వాత, బుద్ధిపూర్వకత దానిని అలాగే ఉంచుతుంది, అలా మనం దానిని కోల్పోకుండా ఉంటాము. కానీ ముందుగా ఆ వస్తువుపై ద్రుష్టి పెట్టడానికి ఏకాగ్రత అనేది చాలా అవసరం.

మనం ఏకాగ్రత కోసం శ్రద్ధను ఉపయోగిస్తాము. గతంతో పోలిస్తే, ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నది ఏమిటంటే, మనం దృష్టిని విభజించసాగాము, కాబట్టి మనం ఒకే దానిపై ఎప్పుడూ పూర్తిగా దృష్టి పెట్టలేదు. మీరు టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఆ రోజు వార్తలను చదివే వ్యక్తి ఉంటాడు, ఆ క్రింద వేరే వార్తల స్క్రాలింగ్ స్క్రిప్ట్ వెళ్తూ ఉంటుంది, పక్కన ములలో వేరే బ్యానర్ లు ఉంటాయి. మనం వాటిలో ఏ ఒక్క దానిపై సరిగ్గా లేదా పూర్తిగా దృష్టి పెట్టలేము. మనం మల్టీ టాస్కింగ్ చేద్దాం అని అనుకున్నా, బుద్ధుడు తప్పితే ఇంకెవరూ కూడా మీరు మల్టీ టాస్కింగ్ చేస్తూ అన్ని విషయాలపై 100% ఏకాగ్రతను పెట్టలేరు.

కొన్నిసార్లు మనం ఎవరితోనైనా ఉన్నప్పుడు, వాళ్లు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన ఆలోచనలు మన సెల్ ఫోన్ లో ఉంటాయి. ఇది తప్పుగా ఆలోచించడం అవుతుంది. ఎందుకంటే వాళ్లు మనతో మాట్లాడుతున్నారు. అయినా మనం అసలు కనీసం వాళ్లపై దృష్టి కూడా పెట్టడం లేదు. మనకు దేనిపైనైనా ఆలోచన ఉంటే, దానిపై అలాగే ఆలోచించడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం చాలా త్వరగా మారుతున్న పరిస్థితులకు, ఒక పని తర్వాత ఇంకొకటి చెయ్యటానికి అలవాటు పడిపోయాం, అలా మనం చాలా ఈజీగా బోర్ అయిపోతున్నాం. ఆ రకమైన ఏకాగ్రత ఉండడం - దీనిపై కొంతసేపు, దానిపై కొంతసేపు - అనేది ఒక అడ్డు. ఇది ఒక తప్పు రకమైన ఏకాగ్రత. సరిగ్గా ఏకాగ్రత సాధించగలగడం అంటే మనకు ఆసక్తి లేకపోయినా దానిమీద విసుగు చెందకుండా, అవసరమైనంత సేపు ఏకాగ్రతను కలిగి ఉండడం.

మనకు వినోదం కావాలనుకోవడమే అసలు ఒక ప్రధాన అడ్డు. ఇది ఇంకా దాహాన్ని సృష్టించడానికి బదులుగా తాత్కాలిక ఆనందం ఇస్తుందని భావించి తప్పు బుద్ధిపూర్వకతకు దారితీస్తుంది. సామాజిక శాస్త్రవేత్తలు మనం ఏమి చేయగలమో వాటికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు - మరియు ఇంటర్నెట్ మనకు వీటికి చాలా అవకాశాలను అందిస్తుంది - అలా మనకు నిజంగా ఎక్కువ విసుగు, ఉద్రిక్తత మరియు ఒత్తిడి వస్తుంది. మీరు దేనినైనా చూస్తున్నప్పుడు, అది ఇంకా వినోదాత్మకంగా ఉండవచ్చని ఆలోచిస్తున్నారు, మరియు దానిని కోల్పోతారని మీరు భయపడుతున్నారు. ఈ విధంగా, మీరు దేనిపైనా దృష్టి పెట్టకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇది కష్టమే అయినప్పటికీ, మీ జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి ఇది నిజంగా మంచిది, అలా ఒకే సమయంలో చాలా విషయాలు జరగకుండా ఉంటాయి. మీ ఏకాగ్రత అభివృద్ధి చెందుతున్నప్పుడు, మీరు వ్యవహరించగల విషయాల పరిధిని పెంచగలుగుతారు.

మీకు మంచి ఏకాగ్రత ఉంటే, మీరు ఒకే దానిపై దృష్టి పెట్టవచ్చు, తర్వాత ఇంకొక దానిపై; అలా దృష్టితో ఒకసారి ఒక పనిని మాత్రమే చెయ్యాలి. ఒక రోగితో ఒకేసారి వ్యవహరించి, ఇంతకుముందు లేదా తర్వాతి రోగి గురించి ఆలోచించకుండా అతని పైనే పూర్తిగా దృష్టి పెట్టాల్సిన డాక్టర్ లా ఉండాలి. ఒక డాక్టర్ ఒక రోజులో చాలా మంది రోగులను చూడగలిగినప్పటికీ, వాళ్లు ఎప్పుడూ ఒక సమయంలో ఒకే వ్యక్తిపై మాత్రమే పూర్తిగా దృష్టి పెడతారు. ఇది ఏకాగ్రతకు చాలా మంచిది.

అయితే ఇది చాలా సవాళ్లతో కూడుకున్నది. ఇక నా విషయానికొస్తే వెబ్ సైట్ తో పాటు వివిధ భాషలతో ఎన్నో రకాల టాస్క్ లు చేస్తుంటాను. ఒకే విషయం మీద దృష్టి పెట్టడం చాలా కష్టం. ఇలా ఎన్నో విషయాలు ఒకేసారి వస్తూ ఉంటాయి. ఒక కష్టమైనా వ్యాపారంలో పనిచేసే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కానీ ఏకాగ్రతను దశలవారీగా పెంపొందించుకోవచ్చు.

సారాంశం

ఏకాగ్రతకు ఉన్న అడ్డంకులను అధిగమించడం చాలా పెద్ద విషయం. ఒక సింపుల్ పద్ధతి ఏమిటంటే, మనం పని చేస్తున్నప్పుడు మన సెల్ ఫోన్ ను ఆఫ్ చేయడం లేదా ఇమెయిల్ లను చెక్ చేసుకోవడానికి రోజులో ఒక టైమ్ ని సెట్ చేసుకోవడం లాంటివి చెయ్యాలి. అలా మనం ఏమి చెయ్యాలనుకుంటున్నామో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాము. ఇది ఒక వైద్యుడు లేదా ప్రొఫెసర్ కు ఆఫీస్ గంటలు లాంటిది; మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు, వాళ్లు అందుబాటులో ఉన్న కొన్ని గంటలు ఉంటాయి. ఇది మన ఏకాగ్రతను పెంపొందించడానికి సహాయపడుతుంది కాబట్టి, మన కోసం కూడా దీన్ని చేసుకోవచ్చు.

సామాజిక వికాసాన్ని కలిగి ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకుముందు, ఏకాగ్రతకు ప్రధాన అడ్డంకులు మన స్వంత ఆలోచనలే - అవి మానసిక సంచారం, పగటి కలలు మొదలైనవి. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, వీటిలో ఎక్కువ భాగం సెల్ ఫోన్లు, ఫేస్ బుక్ మరియు ఇమెయిల్ వంటి వాటి నుంచి వస్తాయి. వాటన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండటానికి నిజంగా చాలా శ్రద్ధ అవసరం. చాలా మందికి తెలిసిన స్పష్టమైన విషయం ఏమిటంటే, శ్రద్ధ పెట్టే టైమ్ తగ్గిపోతూ ఉంది. ట్విట్టర్ పరిమిత సంఖ్యలో అక్షరాలను కలిగి ఉంది మరియు ఫేస్ బుక్ ఫీడ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇది చాలా వేగంగా మారుతూ ఉంది. ఇది ఏకాగ్రతకు హాని కలిగించే భయంకరమైన అలవాట్లను ఏర్పరుస్తుంది, ఎందుకంటే మీరు దేనిపై సరిగా మీ దృష్టిని పెట్టలేరు; ప్రతీదీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన ఒక విషయం.

Top