శాక్యముని బుద్ధుని జీవితం

16:49
సంప్రదాయాన్ని బట్టి, బుద్ధుడిని తన అసాధారణ ప్రయత్నం ద్వారా ముక్తిని సాధించిన ఒక సాధారణ వ్యక్తిగా లేదా జ్ఞానోదయానికి మార్గాన్ని చూపడానికి 2,500 సంవత్సరాల క్రితం అన్నిటినీ చేసి అప్పటికే జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా చూడవచ్చు. ఇక్కడ, మనం బుద్ధుని జీవితాన్ని పరిశీలించి మన ఆధ్యాత్మిక మార్గం కోసం మనం ఎటువంటి ప్రేరణను పొందవచ్చో చూస్తాము.

గౌతమ బుద్ధుడు అని పిలువబడే శాక్యముని బుద్ధుడు క్రీ.పూ 566 నుండి 485 వరకు మధ్య ఉత్తర భారతదేశంలో నివసించాడని ట్రెడిషనల్ డేటింగ్ ప్రకారం తెలుస్తోంది. వివిధ బౌద్ధమత మూలాలలో అతని జీవితానికి సంబంధించిన అనేక, భిన్నమైన కథనాలు ఉన్నాయి, మరిన్ని వివరాలు కాలక్రమేణా క్రమంగా మాత్రమే కనిపిస్తాయి. బుద్ధుడు మరణించిన మూడు శతాబ్దాల తర్వాత మొదటి బౌద్ధమత సాహిత్యం రాశారు కాబట్టి, ఈ వివరాలలో చాలా వరకు వాటి ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం కష్టం. ఏదేమైనా, కొన్ని వివరాలు మిగతా వాటి కంటే ఆలస్యంగా రాతపూర్వక రూపంలో బయట పడ్డాయి కాబట్టి వాటి చెల్లుబాటును తోసిపుచ్చడానికి సరైన కారణం ఉండదు, ఎందుకంటే చాలా వరకు మౌఖిక రూపంలోనే అందరికి తెలిసి వచ్చాయి.

సాధారణంగా, బుద్ధుడితో సహా గొప్ప బౌద్ధ గురువుల సాంప్రదాయ జీవిత చరిత్రలు కేవలం చారిత్రక రికార్డుల కోసం కాకుండా మతపరమైన ప్రయోజనాల కోసం కంపైల్ చెయ్యబడ్డాయి. ఇంకా ముఖ్యంగా, జీవిత చరిత్రలు బౌద్ధ అనుచరులకు మోక్షం మరియు జ్ఞానోదయం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి బోధించే విధంగా మరియు ప్రేరేపించే విధంగా రూపొందించబడ్డాయి. బుద్ధుని జీవిత కథ నుంచి ప్రయోజనం పొందాలంటే, ఈ నేపధ్యంలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి మరియు దాని నుంచి మనం నేర్చుకోగల పాఠాలను విశ్లేషించాలి.

బుద్ధుని జీవిత మూలాలు

బుద్ధుని జీవితానికి తొలి ఆధారాలు థెరవాడ గ్రంథాలలో, మధ్య-పొడవు ప్రవచనాల సంకలనం (పాళీ: మజ్జిమా నికాయ) నుంచి అనేక పాళీ సూత్రాలు మరియు వివిధ హినయన పాఠశాలల నుంచి సన్యాస క్రమశిక్షణ నియమాలకు సంబంధించిన అనేక వినయ గ్రంథాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రంధాలలో ప్రతి ఒక్కటి బుద్ధుని జీవిత కథ యొక్క భాగాలను మాత్రమే వివరిస్తాయి.

క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం చివరిలో హీనయాన మహాసంఘిక పాఠశాలకు చెందిన గ్రేట్ మ్యాటర్స్ (సం. మహావస్తు) లాంటి బౌద్ధ కవితా రచనలలో మొదటి పెద్ద కథనం కనిపించింది. త్రీ బాస్కెట్ లాంటి సేకరణల బయట ఉన్న ఈ గ్రంథం (సం. త్రిపిటక, త్రీ బాస్కెట్స్) ఉదాహరణకు, బుద్ధుడు రాజకుటుంబంలో యువరాజుగా జన్మించాడనే వివరాలను జోడించింది. హీనయాన సర్వస్వస్తీవాద పాఠశాల సాహిత్యంలో ఇటువంటి మరొక కవితా రచన, విస్తృతమైన నాటక సూత్రం (సం. లలితవిస్తారా సూత్రం) కనిపించింది. ఆ తర్వాత ఈ గ్రంథం యొక్క మహాయాన రకాలు ఈ మునుపటి రకాన్ని తీసుకొని విశదీకరించాయి, ఉదాహరణకు, శాక్యముని కొన్ని యుగాల క్రితమే జ్ఞానోదయం పొందాడని మరియు యువరాజు సిద్ధార్థుడిగా ఉద్భవించాడని, ఇతరులకు బోధించడానికి జ్ఞానోదయం పొందే మార్గాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడని వివరించడం జరిగింది.

చివరికి, ఈ జీవిత చరిత్రలలో కొన్ని త్రీ బాస్కెట్ లాంటి సేకరణలలో చేర్చబడ్డాయి. క్రీ.శ. 1 వ శతాబ్దంలో కవి అశ్వఘోషుడు రాసిన బుద్ధుని కార్యాలు (సం. బుద్ధచరిత్ర) బాగా ప్రసిద్ధి చెందినది. ఇతర రకాలు చక్రసంవర సాహిత్యం లాంటి తంత్రాలలో కూడా కనిపించాయి. దూరదృష్టిపై సూత్రాలను బోధించే శాక్యమునిగా (సం. ప్రజ్ఞాపరమిత సూత్రం, జ్ఞాన సూత్రాల పరిపూర్ణత) బుద్ధుడు ఏకకాలంలో వజ్రధారుడిగా అవతరించి తంత్రాలను బోధించినట్లు మనకు తెలుస్తుంది.

ప్రతి దాని నుంచి, మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మరియు మంచి ప్రేరణను పొందవచ్చు. అయితే, చారిత్రక బుద్ధుడిని వర్ణించే రకాలను మనం ముఖ్యంగా పరిశీలిద్దాం.

బుద్ధుని జననం, ప్రారంభ జీవితం, త్యాగం

ప్రారంభ కథనాల ప్రకారం, ప్రస్తుత భారతదేశం మరియు నేపాల్ మధ్య సరిహద్దులో ఉన్న కపిలవస్తులో రాజధానిగా ఉన్న శాక్య రాష్ట్రంలో ఒక కులీన, సంపన్న యోధ కుటుంబంలో శాక్యముని జన్మించాడు. శాక్యముని రాజకుటుంబంలో యువరాజుగా జన్మించాడని ఎటువంటి ప్రస్తావన లేదు, అతని రాచరిక జననం మరియు సిద్ధార్థ అనే పేరు తర్వాతే మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అతని తండ్రి శుద్ధోధనుడు, కానీ అతని తల్లి పేరు మాయాదేవి అని తర్వాతి వాటిల్లో మాత్రమే కనిపిస్తుంది, అలాగే బుద్ధుని కలలో తెల్లని ఆరు దంతాల ఏనుగు తన వైపుకు ప్రవేశించడం గురించి మరియు అతను గొప్ప రాజు లేదా గొప్ప ఋషి అవుతాడని అసిత మహర్షి యొక్క అంచనా గురించి వచ్చింది. ఆ తర్వాత లుంబినీ గ్రోవ్ లోని కపిలవస్తుకు కొద్ది దూరంలో ఉన్న బుద్ధుని స్వచ్చమైన పుట్టుక వర్ణన, అక్కడ ఏడు అడుగులు వేసి "నేను వచ్చాను" అని చెప్పడంతో పాటు ప్రసవ సమయంలో తన తల్లి మరణం గురించి వర్ణన ఉంటుంది.

చిన్నతనంలో బుద్ధుడు సుఖసంతోషాలతో జీవించాడు. అతను యశోధర అనే మహిళను వివాహం చేసుకున్నాడు, మరియు వారికి రాహుల అనే కుమారుడు ఉన్నాడు. బుద్ధుడు తన 29వ యేట తన కుటుంబ జీవితాన్ని, రాచరిక వారసత్వాన్ని వదిలేసి ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా మారాడు.

బుద్ధుని త్యాగాన్ని ఆయన సమాజం, కాలాల నేపధ్యంలో చూడటం ముఖ్యం. బుద్ధుడు ఆధ్యాత్మిక సాధకుడిగా మారడానికి వెళ్ళిపోయినప్పుడు, అతను తన భార్యా బిడ్డలను కష్టాలతో, పేదరికంతో కూడిన జీవితంలో విడిచిపెట్టి వెళ్ళలేదు. వాళ్ళను ఖచ్చితంగా అతని ధనిక కుటుంబం చూసుకుంటుంది. బుద్ధుడు కూడా ఒక యోధుల కులానికి చెందినవాడు, అంటే అతను నిస్సందేహంగా ఒక రోజు తన కుటుంబాన్ని వదిలి యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుంది, ఇది ఒక వ్యక్తి యొక్క కర్తవ్యంగా అంగీకరించబడింది.

బయటి శత్రువులతో అంతులేని యుద్ధాలు చెయ్యవచ్చు, కానీ నిజమైన యుద్ధం మన అంతర్గత శత్రువులతోనే ఉంటుంది. బుద్ధుడు పోరాడటానికి బయలుదేరిన యుద్ధం ఇదే. బుద్ధుడు ఈ ప్రయోజనం కోసం తన కుటుంబాన్ని విడిచిపెట్టడం ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా తన జీవితమంతా అన్వేషణకు అంకితం చెయ్యాలని సూచిస్తుంది. మన ఆధునిక ప్రపంచంలో, మన కుటుంబాలను వదిలి సన్యాసులుగా మారాలంటే, ముందు వాళ్ళను బాగా చూసుకోవాలి. ఇది మన భాగస్వాములు మరియు పిల్లలను మాత్రమే కాదు, మన వృద్ధ తల్లిదండ్రులను కూడా సూచిస్తుంది. బౌద్దులుగా మనం మన కుటుంబాలను విడిచిపెట్టినా, బుద్ధుని లాగా సంతోషం పెట్టే వాటిని వదిలించుకోవడం ద్వారా మన బాధను తగ్గించుకోవాలి.

పుట్టుక, వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, పునర్జన్మ, విచారం మరియు ఇబ్బందుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా బుద్ధుడు బాధను జయించాలని కోరుకున్నాడు. తర్వాతి కథలలో, బుద్ధుడిని అతని రథ సారథి చన్న ఆ రాజభవనం నుంచి బయటకు తీసుకువెళతాడు. నగరంలో బుద్ధుడు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చనిపోయిన వారిని, అలాగే ఒక సన్యాసిని చూస్తాడు. చన్న ఒక్కొక్కరిని చూపించి వాళ్ళ గురించి వివరిస్తాడు. ఈ విధంగా బుద్ధుడు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న బాధలను గుర్తించి, దాని నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించే ప్రయత్నం చేశాడు.

బుద్ధుడు తన రథ చోదకుడి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో సహాయం పొందే ఈ ఎపిసోడ్ భగవద్గీతలో తన బంధువులతో యుద్ధం చెయ్యడానికి యోధుడిగా తన కర్తవ్యం గురించి అర్జునుడు తన రథ సారథి కృష్ణుడు చెప్పిన కథకి సమాంతరంగా ఉంటుంది. బౌద్ధ, హిందూ సందర్భాలలో, సత్యాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించడానికి మన సౌకర్యవంతమైన జీవితాల గోడలను దాటి వెళ్ళడం యొక్క లోతైన ప్రాముఖ్యతను మనం చూడవచ్చు. రథం మోక్షానికి దారితీసే మనస్సు యొక్క వాహనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, రథ సారథి మాటలు చోదక శక్తి - రియాలిటీని అన్వేషించడానికి.

బుద్ధుని అధ్యయనాలు మరియు జ్ఞానోదయం

బ్రహ్మచారిగా, ఆధ్యాత్మిక సాధకుడిగా, బుద్ధుడు ఇద్దరు గురువులతో మానసిక స్థిరత్వం మరియు రూప రహిత జ్ఞానాన్ని సాధించే పద్ధతులను అధ్యయనం చేశాడు. పరిపూర్ణ ఏకాగ్రత యొక్క ఈ లోతైన స్థితుల యొక్క అత్యున్నత స్థాయిని అతను సాధించగలిగాడు, దీనిలో అతను ఇకపై తీవ్రమైన బాధను లేదా సాధారణ ప్రాపంచిక ఆనందాన్ని దేనినీ అనుభవించలేదు, కాని అతను దీనితో సంతృప్తి చెందలేదు. ఈ స్థితులు ఈ ఇబ్బంది పెట్టే భావాల నుంచి శాశ్వత ఉపశమనం కలిగించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని గమనించాడు; అతను అధిగమించడానికి ప్రయత్నించిన లోతైన, విశ్వవ్యాప్త బాధలను అవి ఖచ్చితంగా తొలగించలేవు. ఐదుగురు సహచరులతో కలిసి, అతను తీవ్రమైన సన్యాసాన్ని ఆచరించాడు, కానీ ఇది నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మతో (సంసారం) సంబంధాన్ని కలిగి ఉన్న లోతైన సమస్యలను కూడా తొలగించలేదు. తర్వాతి వాటిల్లో బుద్ధుడు నిరంజన నది ఒడ్డున తన ఆరేళ్ళ ఉపవాస దీక్షను విరమించిన సంఘటన కనిపిస్తుంది, అక్కడ సుజాత అనే ఒక పని మనిషి అతనికి ఒక గిన్నె పాలను ఇస్తుంది.

మాదకద్రవ్యాలు లాంటి కృత్రిమ మార్గాల ద్వారా కాకుండా, పూర్తిగా ప్రశాంతంగా ఉండటం లేదా ధ్యానంలో "ఉన్నతంగా" నిమగ్నం కావడం ద్వారా మనం సంతృప్తి చెందకూడదని బుద్ధుని ఉదాహరణ సూచిస్తుంది. లోతైన మత్తులోకి జారుకోవడం, లేదా విపరీతమైన పద్ధతులతో మనల్ని మనం హింసించుకోవడం లేదా శిక్షించడం కూడా పరిష్కారం కాదు. మనం ముక్తి మరియు జ్ఞానోదయం వైపు వెళ్ళాలి, మరియు ఈ లక్ష్యాలకు మనల్ని దగ్గర చేసే ఆధ్యాత్మిక పద్ధతులతో మనం ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు.

బుద్ధుడు సన్యాసాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత, అతను భయాన్ని అధిగమించడానికి అడవిలో ఒంటరిగా ఉండి ధ్యానం చేశాడు. అన్ని భయాలకు మూలం అసలు ఉనికిలో లేని "నేను" అని, ఆనందం మరియు వినోదం కోసం మన బలవంతపు అన్వేషణకు ఆధారమైన బలమైన స్వార్ధపు ఆలోచన అని గ్రహించడం. అందువల్ల, 10 వ శతాబ్దపు భారతీయ గురువు ధర్మరక్షిత ది వీల్ ఆఫ్ షార్ప్ వెపన్స్ లో, విష మొక్కల అడవులలో సంచరిస్తున్న నెమళ్ల చిత్రాన్ని బోధిసత్వులు తమ స్వార్ధపు ఆలోచనను అధిగమించడానికి మరియు అసాధ్యమైన "నేను" కోసం గ్రహించడంలో సహాయపడటానికి కోరిక, కోపం మరియు అమాయకత్వం యొక్క విషపూరిత భావోద్వేగాలను మార్చడానికి ఉపయోగించారు.

చాలా సేపు ధ్యానం చేసిన తర్వాత, బుద్ధుడు 35 సంవత్సరాల వయస్సులో పూర్తి జ్ఞానోదయాన్ని పొందాడు. అసూయ గల దేవుడైన మారా నుంచి వచ్చిన దాడులను విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత, ప్రస్తుత బోధ్ గయాలోని ఒక బోధి చెట్టు క్రింద అతను జ్ఞానోదయాన్ని సాధించిన వివరాలను తర్వాతి కథనాలు అందిస్తాయి. బుద్ధుని ధ్యానానికి అంతరాయం కలిగించడానికి మరిన్ని భయానక మరియు ఆకర్షణీయమైన రూపాలను చూపిస్తూ అతని జ్ఞానోదయ ప్రక్రియకు భంగం కలిగించడానికి చాలా శక్తులు ప్రయత్నించాయి.

మొదటి కథలలో చెప్పినట్లుగా, బుద్ధుడు మూడు రకాల జ్ఞానాన్ని పొందడం ద్వారా పూర్తి జ్ఞానోదయాన్ని పొందాడు: అవి తన గత జన్మల గురించి, ఇతరులందరి కర్మ మరియు పునర్జన్మల గురించి, మరియు నాలుగు ఉత్తమమైన సత్యాల గురించి పూర్తి జ్ఞానం. ఈ జ్ఞానోదయంతో సర్వజ్ఞానాన్ని సాధించాడని తర్వాతి కథలు వివరిస్తాయి.

బౌద్ధమత సన్యాస సంఘాన్ని స్థాపించడం మరియు బోధించడం 

జ్ఞానోదయం పొందిన తర్వాత, బుద్ధుడు ఇతరులకు దాన్ని సాధించే మార్గాన్ని బోధించడానికి సంకోచించాడు, ఎందుకంటే ఎవరూ దాన్ని అర్థం చేసుకోలేరని అతను అనుకున్నాడు. అయితే విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ, దేవతల రాజు ఇంద్రుడు ఆయనను దీన్ని ఇతరులకు బోధించమని వేడుకున్నారు. తన అభ్యర్థనలో, బ్రహ్మ బుద్ధునితో తాను బోధించడంలో విఫలమైతే లోకం అంతం కాకుండా బాధలు పడుతూ ఉంటుందని, కనీసం తన మాటలను అర్థం చేసుకోగలిగిన వారు కొద్ది మంది అయినా ఉంటారని చెప్పాడు.

ఈ వివరాలు ఒక సెటైర్ విషయం కావచ్చు, ఇది బుద్ధుని బోధనల ఔన్నత్యాన్ని సూచిస్తుంది, ఇది అతని కాలపు సాంప్రదాయ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు అందించే పద్ధతులను అధిగమించింది. ప్రపంచానికి బుద్ధుని బోధనలు అవసరమని, ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధలను శాశ్వతంగా అంతం చేసే పద్ధతులు ఇంకేమీ లేవని, కాబట్టి సాధారణ ప్రజలకు ఈ బోధనలు చెప్పాలని అత్యున్నత దేవతలు కూడా అంగీకరించారు. అంతేకాక, బౌద్ధమత చిత్రాలలో, బ్రహ్మ అహంకారానికి గుర్తుగా ఉంటాడు; తాను సర్వ శక్తిమంతుడైన సృష్టికర్తననే అతని తప్పుడు విశ్వాసం అసాధ్యంగా ఉన్న ఈ "నేను" అనేది ఉనికిలో ఉందని మరియు జీవితంలో ప్రతిదాన్ని నియంత్రించగలదని అనుకోవడంలో ఇబ్బందులకు అతను ప్రతిరూపం. అటువంటి విశ్వాసం అనవసరంగా నిరాశ మరియు బాధలను కలిగిస్తుంది. మన ఉనికి గురించి బుద్ధుని బోధనలు మాత్రమే ఈ నిజమైన బాధను మరియు దాని నిజమైన కారణాన్ని నిజంగా ఆపడానికి ఒక మార్గాన్ని అందించగలవు.

బ్రహ్మ, ఇంద్రుల అభ్యర్థనను ఒప్పుకుని బుద్ధుడు సారనాథ్ కు వెళ్లి అక్కడ డీర్ పార్కులో తన పాత ఐదుగురు సహచరులకు నాలుగు ఉత్తమమైన సత్యాలను బోధించాడు. బౌద్ధమత చిత్రాలలో, జింకలు సున్నితత్వాన్ని సూచిస్తాయి మరియు అందువల్ల బుద్ధుడు ఈ సున్నితమైన పద్ధతిని బోధిస్తాడు, సుఖ సిద్ధాంతం మరియు సన్యాసం యొక్క తీవ్రతలకు దూరంగా ఉంటాడు.

వెంటనే సమీపంలోని వారణాసికి చెందిన పలువురు యువకులు బ్రహ్మచర్యం పాటిస్తూ బుద్ధునితో చేరారు. వారి తల్లిదండ్రులు సాధారణ శిష్యులుగా మారి భిక్షాటన చేస్తూ ఈ గ్రూప్ కి సహకరించడం ప్రారంభించారు. ఎవరైనా సభ్యులు తగినంత శిక్షణ పొంది, అర్హత సాధించిన వెంటనే, ఇతరులకు బోధించడానికి వారిని బయటకు పంపుతారు. ఈ విధంగా, బుద్ధుని అనుచరుల గ్రూప్ త్వరగా అభివృద్ధి చెందింది మరియు వెంటనే వాళ్ళు స్థిరపడి వివిధ ప్రదేశాలకు వెళ్లి అక్కడ వ్యక్తిగత "సన్యాస" సంఘాలను ఏర్పరచుకున్నారు.

బుద్ధుడు ఈ సన్యాస సంఘాలను ఆచరణాత్మక మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాడు. సన్యాసులు, అంటే ఈ పదాన్ని మనం ప్రారంభ దశలోనే ఉపయోగిస్తే, కమ్యూనిటీలలో చేరడానికి అభ్యర్థులను అనుమతించవచ్చు, కాని లౌకిక అధికారులతో గొడవలను తగ్గించడానికి వారు కొన్ని ఆంక్షలను పాటించవలసి వచ్చింది. అందువల్ల, ఈ సమయంలో, బుద్ధుడు నేరస్థులను, సైన్యం లాంటి రాజ సేవలో ఉన్నవారిని, బానిసత్వం నుంచి విముక్తి పొందని బానిసలను మరియు కుష్టు వ్యాధి లాంటి అంటు వ్యాధులు ఉన్నవారిని సన్యాస సమాజాలలో చేరకుండా చూసుకున్నాడు. అంతేకాకుండా 20 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవడానికి కూడా అనుమతించలేదు. బుద్ధుడు ఇబ్బందులను లేకుండా ఉండేలా మరియు సమాజం పట్ల మరియు ధర్మ బోధనల పట్ల ప్రజల గౌరవాన్ని పొందాలని అనుకున్నాడు. బుద్ధుని అనుచరులుగా, మనం స్థానిక ఆచారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని మరియు గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇది సూచిస్తుంది, అలా ప్రజలు బౌద్ధమతంపై మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు మరియు తిరిగి దాన్ని గౌరవిస్తారు.

అప్పుడే బుద్ధుడు బోధ్ గయా ఉన్న మఘద రాజ్యానికి తిరిగి వచ్చాడు. బింబిసార మహారాజు ఆయనను రాజధాని నగరమైన రాజగ్రకు - ఆధునిక రాజ్ గిర్ ద్వారా ఆహ్వానించబడ్డాడు, తర్వాత అతను బుద్ధుని శిష్యుడు అయ్యాడు. అక్కడ, శరీపుత్రుడు మరియు మౌద్గల్యయానుడు కూడా బుద్ధుని ఎదుగుదల క్రమంలో చేరి అతనికి అత్యంత సన్నిహిత శిష్యులు అయ్యారు.

జ్ఞానోదయం పొందిన ఒక సంవత్సరంలోనే, బుద్ధుడు తన స్వస్థలమైన కపిలవస్తుకు తిరిగి వచ్చాడు, అక్కడ అతని కుమారుడు రాహుల అతని అడుగుజాడల్లో చేరాడు. అప్పటికే బుద్ధుని సోదరుడు, అందమైన నందుడు ఇంటిని వదిలి చేరాడు. బుద్ధుని తండ్రి అయిన శుద్ధోదన మహారాజు కుటుంబ వారసత్వం ఆగిపోయిందని చాలా బాధపడ్డాడు, అందువల్ల భవిష్యత్తులో, ఒక కుమారుడు సన్యాసంలో చేరడానికి తన తల్లిదండ్రుల సమ్మతిని కలిగి ఉండాలని అభ్యర్థించాడు. బుద్ధుడు దానికి పూర్తిగా అంగీకరించాడు. బుద్ధుడు తన తండ్రి పట్ల చూపిన క్రూరత్వంగా దీన్ని చూడలేమని కాదు, బౌద్ధమతం పట్ల, ముఖ్యంగా మన కుటుంబాల్లో చెడు ఆలోచనలను సృష్టించకుండా ఉండడమే ఈ కథనం యొక్క ఉద్దేశ్యం.

బుద్ధుడు తన కుటుంబంతో కలుసుకోవడం గురించి ఇంకొక వివరణ ఏమిటంటే, ముప్పై మూడు దేవుళ్ల స్వర్గానికి ప్రయాణించడానికి అతను బయటి భౌతిక శక్తులను ఉపయోగించాడు, లేదా కొన్ని మూలాల ప్రకారం, తుషితా స్వర్గంలో పునర్జన్మ పొందిన తన తల్లికి బోధించడానికి. ఇది తన తల్లి దయను ప్రశంసించడం మరియు తిరిగి చెల్లించడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.

బౌద్ధ సన్యాస వ్యవస్థ యొక్క పెరుగుదల

బుద్ధుని సన్యాసుల ప్రారంభ సమాజాలు చిన్నవి మరియు అందులో 20 మంది పురుషులు మాత్రమే ఉండేవారు. భిక్షాటన కోసం వెళ్ళే సన్యాసులకు నిర్దేశించిన సరిహద్దులను అనుసరించి ప్రతి గ్రూప్ ఉండేది. ప్రతి గ్రూప్ యొక్క పనులు మరియు నిర్ణయాలు అందులోని సభ్యుల మధ్య ఏకాభిప్రాయ ఓటు ద్వారా నిర్ణయించబడ్డాయి, అలా విభేదాలను నివారిస్తూ ఏ ఒక్క వ్యక్తిని అధికారిగా నిర్ణయించకుండా ఉండగలరు. ధర్మ బోధనలను తామే అధికారంగా తీసుకోవాలని బుద్ధుడు వారికి సూచించాడు. అవసరమైతే సన్యాస క్రమశిక్షణను కూడా మార్చవచ్చు అని, కానీ అందులో ఏవైనా మార్పులు మొత్తం సమాజం యొక్క ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉండాలి అని చెప్పాడు.

త్రైమాసిక సమావేశాలు నిర్వహించే జైనుల లాగా ఇతర ఆధ్యాత్మిక గ్రూప్ ల నుంచి బుద్ధుడు కొన్ని ఆచారాలను తీసుకోవచ్చని బింబిసార రాజు సూచించాడు. ఈ ఆచారం ప్రకారం, ఆధ్యాత్మిక సమాజ సభ్యులు చంద్రుని యొక్క ప్రతి పావు దశ ప్రారంభంలో సమావేశమై బోధనల గురించి చర్చిస్తారు. అందుకు బుద్ధుడు అంగీకరించి, ఆనాటి ఆచారాలను అనుసరించాలనే సూచనలకు తాను సిద్ధంగా ఉన్నానని చూపిస్తూ, జైనుల తర్వాత తన ఆధ్యాత్మిక సమాజాలు మరియు తన బోధనల నిర్మాణం యొక్క అనేక అంశాలను నమూనాగా తీసుకున్నాడు. జైన మత స్థాపకుడైన మహావీరుడు బుద్ధుని కంటే అర్ధ శతాబ్దం ముందు పుట్టి జీవించి ఉన్నాడు.

సన్యాస క్రమశిక్షణ నియమావళికి నియమాలను రూపొందించమని శరీపుత్రుడు బుద్ధుడిని కోరాడు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు నిర్దిష్ట సమస్యలు వచ్చే వరకు వేచి ఉండటమే మంచిదని బుద్ధుడు నిర్ణయించుకున్నాడు. ఎవరికైనా హాని కలిగించే సహజ విధ్వంసక పనులు, కొన్ని సందర్భాల్లో మరియు కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తులకు నైతికంగా తటస్థ చర్యలు రెండింటికి సంబంధించి ఈ విధానం అనుసరించబడింది. అందువల్ల, క్రమశిక్షణ నియమాలు (వినయ) ఆచరణాత్మకమైనవి మరియు తాత్కాలికంగా రూపొందించబడ్డాయి, బుద్ధుని ప్రధాన ఆలోచనలు సమస్యలను నివారించి నేరాన్ని కలిగించడం అని కాదు.

క్రమశిక్షణ నియమాల ఆధారంగా, బుద్ధుడు త్రైమాసిక నెలవారీ సన్యాస సభలో ప్రతిజ్ఞల పఠనాన్ని స్థాపించాడు, సన్యాసులు ఏవైనా వాటి గురించి సమస్యలు ఉంటే బహిరంగంగా అంగీకరించారు. అత్యంత తీవ్రమైన సమస్యలు ఉంటే అవి సమాజం నుంచి బహిష్కరించబడతాయి, లేకపోతే ప్రొబేషన్ యొక్క అవమానం మాత్రమే. ఆ తర్వాత ఈ సమావేశాలు రెండు నెలలకు ఒకసారి మాత్రమే జరిగాయి.

అప్పుడు బుద్ధుడు మూడు నెలల వర్షాకాల విహార రిట్రీట్ ను ఏర్పాటు చేశాడు, ఈ సమయంలో సన్యాసులు ఒక ప్రదేశంలో ఉండి ఎటూ వెళ్లకుండా ఉంటారు. రహదారులు జలమయమైనప్పుడు సన్యాసులు పొలాల గుండా నడవాల్సి వచ్చినప్పుడు పంటలు దెబ్బతినకుండా నిరోధించడమే దీని లక్ష్యం. ఇది కొన్నిచోట్ల శాశ్వత మఠాల స్థాపనకు దారితీసింది, ఇది మంచి విషయమే. మళ్ళీ, ఈ డెవలప్‌మెంట్ సాధారణ సమాజానికి హాని కలిగించకుండా ఉండటానికి మరియు వారి గౌరవాన్ని పొందడానికి పుట్టింది.

రెండవ వర్షాకాలం నుంచి బుద్ధుడు 25 వేసవికాలాలను కోశాల రాజ్యానికి రాజధాని అయిన శ్రావస్తి కి బయట ఉన్న జెతవన తోటలో గడిపాడు. ఇక్కడ వ్యాపారి అనంతపిండాడ బుద్ధుడు మరియు అతని సన్యాసుల కోసం ఒక మఠాన్ని నిర్మించాడు, మరియు రాజు ప్రసేనాజిత్ ఈ సమాజానికి మరిన్ని మంచి పనులు చేశాడు. జెతవనలోని ఈ మఠం బుద్ధుని జీవితంలో అనేక గొప్ప సంఘటనలకు వేదికగా ఉంది, అత్యంత ప్రసిద్ధి చెందినది బహుశా ఆనాటి ఆరు ప్రధాన బౌద్ధేతర పాఠశాలల నాయకులను అద్భుత శక్తుల పోటీలో ఓడించడం లాగా.

ఈ రోజుల్లో మనలో ఎవరూ అద్భుతాలు చెయ్యలేనప్పటికీ, బుద్ధుడు తన ప్రత్యర్థులను ఓడించడానికి లాజిక్ కి బదులుగా వాటిని ఉపయోగించడం ఇతరుల మనస్సులు హేతుబద్ధతకు మూసివేసినప్పుడు, మన అవగాహన యొక్క ప్రామాణికతను వారిని ఒప్పించడానికి ఉత్తమ మార్గం చర్యలు మరియు ప్రవర్తన ద్వారా మన సాక్షాత్కార స్థాయిని ప్రదర్శించడం అని సూచిస్తుంది. మనకు ఇంగ్లీషులో "యాక్షన్ స్పీక్స్ లౌడర్ థాన్ వర్డ్స్" అనే సామెత కూడా ఉంది.

బౌద్ధమత సన్యాసినుల ఆశ్రమ వ్యవస్థ స్థాపన

తర్వాత బుద్ధుడు తన టీచింగ్ కెరీర్ లో, తన అత్త మహాప్రజాపతి అభ్యర్థన మేరకు వైశాలిలో సన్యాసినుల సంఘాన్ని స్థాపించాడు. అతను మొదట్లో అటువంటి పనిని చెయ్యడానికి ఒప్పుకోలేదు, కాని తర్వాత సన్యాసుల కంటే సన్యాసినులకు ఎక్కువ ప్రతిజ్ఞలు నిర్వహిస్తే అది సాధ్యమని నిర్ణయించుకున్నాడు. అలా చెయ్యాలంటే, బుద్ధుడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారని, కాబట్టి ఎక్కువ ప్రతిజ్ఞలను నిలబెట్టుకోవడంతో వాళ్ళను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పలేదు. దానికి బదులుగా, స్త్రీ వ్యవస్థను స్థాపించడం చెడ్డ పేరు తెస్తుందని మరియు తన బోధనలకు ముగించేస్తుందని అతను భయపడ్డాడు. అన్నింటికీ మించి, బుద్ధుడు సమాజాన్ని అగౌరవపరచకుండా ఉండాలని కోరుకున్నాడు, కాబట్టి సన్యాసినుల సమాజం ఏదైనా అనైతిక ప్రవర్తనకు అనుమానానికి అతీతంగా ఉండాలి అని అనుకున్నాడు.

మొత్తానికి, బుద్ధుడు నియమాలను రూపొందించడానికి విముఖత చూపాడు మరియు తక్కువ ప్రభావం కలిగి ఉన్న వాటిని అనవసరమని తెలిస్తే వాటిని రద్దు చెయ్యడానికి సిద్ధం అయ్యాడు, ఈ విధానం రెండు సత్యాల యొక్క రూపాన్ని చూపుతుంది - లోతైన సత్యం, ఇంకా స్థానిక ఆచారాలకు అనుగుణంగా సాంప్రదాయిక సత్యాన్ని గౌరవించడం. లోతైన సత్యంలో, సన్యాసినుల ఆదేశం కలిగి ఉండటంలో ఎటువంటి సమస్య లేనప్పటికీ, ఆనాటి సాధారణ ప్రజలు బౌద్ధమత బోధనలను చిన్నచూపు చూడకుండా నిరోధించడానికి, సన్యాసినులకు ఎక్కువ క్రమశిక్షణ నియమాలు అవసరం పడ్డాయి. నిజం ఏమిటంటే, సమాజం ఏమి చెబుతుంది లేదా ఆలోచిస్తుంది అనేది ముఖ్యం కాదు, సాంప్రదాయిక సత్యంలో, బౌద్ధమత సమాజం ప్రజల గౌరవాన్ని మరియు నమ్మకాన్ని పొందాలి. అందుకని బౌద్ధమతాన్ని అగౌరవపరిచే ఆధునిక కాలంలో, బౌద్ధమత ఆచారాల ద్వారా సన్యాసినుల పట్ల లేదా ఏదైనా మైనారిటీ గ్రూప్ పట్ల తేడా చూపిస్తే, వాటిని కాలపు నియమాల ప్రకారం సవరించడమే బుద్ధుని స్ఫూర్తి.

అన్నింటికన్నా, సహనం మరియు కరుణ బుద్ధుని బోధనలలో ప్రధానమైనవి. ఉదాహరణకు, బుద్ధుడు గతంలో మరొక మత సమాజానికి సహాయం చేసిన కొత్త శిష్యులను ఆ సమాజానికి కూడా అలాగే సహకరించమని ప్రోత్సహించాడు. బౌద్ధమత వ్యవస్థలో, అతను సభ్యులను ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించాడు, ఉదాహరణకు, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వాళ్లంతా బౌద్ధమత కుటుంబానికి చెందిన వాళ్లలాగే చూసుకోవాలని చెప్పాడు. సాధారణ బౌద్ధులందరికీ కూడా ఇది ఒక ముఖ్యమైన ఉపదేశం.

బుద్ధుడు బోధించే పద్ధతి

బుద్ధుడు తన బోధనలతో మరియు తన జీవిత ఉదాహరణతో బోధించాడు. బోధనల కోసం, అతను ఒక గ్రూప్ కి లేదా ఒక వ్యక్తికి మాత్రమే బోధిస్తున్నాడా అనే దానిపై ఆధారపడి రెండు పద్ధతులను అనుసరించాడు. గ్రూప్ ల ముందు, బుద్ధుడు తన బోధనలను ఉపన్యాస రూపంలో వివరించేవాడు, అప్పుడు ప్రతి అంశాన్ని వివిధ పదాలతో రిపీట్ చేసేవాడు, అలా వినే వాళ్ళు దాన్ని బాగా అర్థం చేసుకుంటారు మరియు గుర్తుంచుకుంటారు అని. సాధారణంగా తనను, తన సన్యాసులను భోజనానికి ఆహ్వానించిన ఇంటిలో భోజనం చేసిన తర్వాత వ్యక్తిగత బోధన చేసేటప్పుడు, బుద్ధుడు వేరే విధానాన్ని ఉపయోగించేవాడు. వినేవాళ్ళ అభిప్రాయాన్ని అతడు ఎప్పుడూ వ్యతిరేకించడు లేదా సవాలు చెయ్యడు, కానీ వారి వైఖరిని తగ్గట్టుగా వాళ్ల ఆలోచనలను స్పష్టం చెయ్యడంలో సహాయపడటానికి ప్రశ్నలు అడుగుతాడు. ఈ విధంగా, బుద్ధుడు ఆ వ్యక్తి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి మరియు క్రమంగా రియాలిటీ గురించి లోతైన అవగాహనను పొందడానికి ఇది సహాయపడుతుంది. ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆధిక్యత అనేది ఒక వ్యక్తి జన్మించిన కులం నుంచి రాదు, ఒక వ్యక్తి యొక్క మంచి లక్షణాల అభివృద్ధి నుంచి వస్తుందని బుద్ధుడు బ్రాహ్మణ కులానికి చెందిన ఒక గర్వించదగిన సభ్యుడికి అర్థమయ్యేలా చెప్పాడు.

ఇంకొక ఉదాహరణ ఏమిటంటే బుద్ధుని దగ్గరకు ఒక చనిపోయిన బిడ్డతో వచ్చిన నిస్సహాయ తల్లికి, ఆ బిడ్డను తిరిగి బ్రతికించమని బుద్ధుడిని వేడుకునే సంఘటన. ఆ సమయంలో బుద్ధుడు ఆమెకు అస్సలు చావు రాణి ఇంటి నుంచి ఒక ఆవాల విత్తనాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు అతను ఏమి సహాయం చెయ్యగలడో చూస్తానని చెప్పాడు. ఆ మహిళ ప్రతి ఇంటికి వెళ్లింది, కానీ ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పారు. ఏదో ఒక రోజు అందరూ చచ్చిపోవాల్సిందేనని నెమ్మదిగా గ్రహించి, ఆ విధంగా తన బిడ్డకు మనశ్శాంతితో దహన సంస్కారాలు చెయ్యగలిగింది.

వ్యక్తిగత సంభాషణలలో ప్రజలకు సహాయపడటానికి, వ్యతిరేకతను చూపకుండా ఉండడమే మంచిదని బుద్ధుని బోధనా పద్ధతి మనకు నేర్పిస్తుంది. వాళ్ళు తమ గురించి తాము ఆలోచించడంలో సహాయపడటం అత్యంత ప్రభావవంతమైన మార్గం. అయితే, వ్యక్తుల సమూహాలకు బోధించేటప్పుడు, విషయాలను సూటిగా మరియు స్పష్టంగా వివరించడం మంచిది.

బుద్ధుడికి వ్యతిరేకంగా కుట్రలు మరియు ఎత్తుగడలు

బుద్ధుడు చనిపోవడానికి ఏడు సంవత్సరాల ముందు, అతని బంధువు దేవదత్తుడు అసూయతో బుద్ధుని స్థానమైన అధిపతిని తీసుకోవాలని కుట్ర పన్నాడు. అదే విధంగా, యువరాజు అజాతశత్రుడు తన తండ్రి బింబిసార రాజు స్థానంలో మగధకు పాలకుడిగా నియమించడానికి కుట్ర పన్నాడు, అలా ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. అజాతశత్రువు బింబిసారుడిపై హత్యాయత్నం చేశాడు, దాని ఫలితంగా రాజు తన కుమారుడి కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. అజాతశత్రుని విజయాన్ని చూసిన దేవదత్తుడు బుద్ధుడిని చంపమని కోరాడు, కాని అతన్ని చంపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

దీంతో విసుగుచెందిన దేవదత్తుడు బుద్ధుడి కంటే "పవిత్రుడు" నేనే అని చెప్పుకుంటూ, కఠినమైన క్రమశిక్షణా నియమాలను ప్రతిపాదించడం ద్వారా సన్యాసులను బుద్ధుడి నుండి దూరం చెయ్యడానికి ప్రయత్నించాడు. క్రీ.శ 4 వ శతాబ్దం నాటి శుద్ధి మార్గం (పాళీ: విశుద్ధిమగ్గ) ప్రకారం, దేవదత్తుని కొత్త ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • దుప్పట్లతో కుట్టిన దుస్తులను ధరించడం.
  • మూడు దుస్తులను మాత్రమే ధరించడం.
  • భిక్షాటన కోసం మాత్రమే వెళ్ళాలి మరియు భోజనానికి ఆహ్వానాలను ఎప్పుడూ స్వీకరించకుండా ఉండడం.
  • భిక్షాటనకు వెళ్ళేటప్పుడు ఏ ఇంటిని వదలకుండా ఉండడం.
  • సేకరించిన భిక్షను ఒకేచోట కూర్చొని తినడం. 
  • భిక్షాటనకు ఉపయోగించే గిన్నెలో మాత్రమే తినడం.
  • అన్ని ఇతర ఆహారాలను తిరస్కరించడం.
  • అడవిలో మాత్రమే జీవించడం.
  • చెట్ల కింద నివసించడం.
  • ఇళ్లలో కాకుండా బయట ప్రదేశాల్లో నివసించడం.
  • ఎక్కువగా శ్మశాన మైదానాల్లో నివసించడం.
  • ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఎప్పుడూ  తిరుగుతూ, ఏ ప్రదేశం దొరికితే దానితో సంతృప్తి చెందడం.
  • కూర్చొనే భంగిమలో మాత్రమే పడుకోవడం, ఎప్పుడూ కింద వెల్లకిలా పడుకోకపోవడం. 

సన్యాసులు ఈ మిగతా క్రమశిక్షణ నియమాలను పాటించాలనుకుంటే, అది పూర్తిగా మంచిదేనని, కానీ ప్రతి ఒక్కరినీ అలా చెయ్యమని బలవంత పెట్టడం అసాధ్యమని బుద్ధుడు చెప్పాడు. అనేక మంది సన్యాసులు దేవదత్తుడిని అనుసరించాలని అనుకున్నారు, అందువల్ల బుద్ధుని సమాజాన్ని వదిలి వారి స్వంత నియమాలను ఏర్పరుచుకున్నారు.

దేవదత్తుడు పెట్టిన అదనపు క్రమశిక్షణ నియమాలను "గమనించే అభ్యాసం యొక్క 13 వర్గాలు" అని పిలుస్తారు. ఉదాహరణకు ఆధునిక థాయ్ లాండ్ లో ఇప్పటికీ కనిపించే అటవీ సన్యాసి సంప్రదాయం ఈ ఆచారం నుంచే వచ్చినట్లు అనిపిస్తుంది. బుద్ధుని శిష్యుడు మహాకాశ్యపుడు ఈ కఠినమైన క్రమశిక్షణను అనుసరించిన అత్యంత ప్రసిద్ధ అభ్యాసకుడు అయ్యాడు, దీనిలోని ఎక్కువ భాగం నేడు హిందూ సంప్రదాయంలో సంచరించే పవిత్ర పురుషులు, సాధువులు ఆచరిస్తున్నారు. బుద్ధుని కాలం నాటి ఆధ్యాత్మిక సాధకులు అలా తిరిగే సంప్రదాయానికి కొనసాగింపుగా వీరి ఆచారం కనిపిస్తుంది.

మహాయాన పాఠశాలలు ఇలాంటి అభ్యాసం యొక్క 12 లక్షణాల లిస్ట్ ను కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో "భిక్షాటనకు వెళ్ళేటప్పుడు ఏ ఇంటిని విడిచిపెట్టకూడదు" అని, "చెత్త బుట్టలో పారవేసిన దుస్తులనే ధరించడం" అని మరియు "భిక్షాటన గిన్నెలో నుంచి మాత్రమే తినడం" అని ఉన్నాయి. ఈ క్రమశిక్షణలో ఎక్కువ భాగం తర్వాతి మహాయాన బౌద్ధం మరియు హిందూ మతం రెండింటిలోనూ కనిపించే గొప్ప తాంత్రిక అభ్యాసకులు, మహాసిద్ధుల భారతీయ సంప్రదాయంలో అనుసరించబడింది.

స్థాపించబడిన బౌద్ధమత సంప్రదాయం నుంచి విడిపోయి మరొక ఆర్డర్ ని ఏర్పరచడం, లేదా ఆధునిక పరిభాషలో, బహుశా ప్రత్యేక ధర్మ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం అసలు సమస్య కాదు. అలా చెయ్యడం ఐదు ఘోరమైన నేరాలలో ఒకటైన "సన్యాస సమాజంలో ఎత్తుగడలను" సృష్టించినట్లు చూడబడలేదు. దేవదత్తుడు అటువంటి విభేదాలను సృష్టించాడు, ఎందుకంటే విడిపోయి అతనిని అనుసరించిన సమూహం బుద్ధుని సన్యాస సమాజం పట్ల విపరీతమైన చెడు సంకల్పాన్ని కలిగి ఉంది మరియు వారిని తీవ్రంగా విమర్శించింది. కొన్ని కథనాల ప్రకారం, ఈ ఎత్తుగడల యొక్క చెడు ఉద్దేశం కొన్ని శతాబ్దాల పాటు ఉంటుంది.

బుద్ధుడు అత్యంత సహనశీలి అని, ఏ మాత్రం ఛాందసవాది కాదని ఈ విభేదాల వర్ణన తెలియజేస్తుంది. ఆయన అనుచరులు తమ కోసం నిర్దేశించిన దానికంటే కఠినమైన క్రమశిక్షణను పాటించాలనుకుంటే సరే అని; మరియు వారికి అటువంటి కోరిక లేకపోతే, అది కూడా సరే అని చెప్పబడింది. బుద్ధుడు బోధించిన దానిని ఆచరించవలసిన బాధ్యత ఎవరికీ లేదు. సన్యాసి లేదా సన్యాసిని ఏదైనా ఆశ్రమాన్ని విడిచిపెట్టాలనుకుంటే, అది కూడా మంచిదే అని చెప్పబడింది. ఏదేమైనా, బౌద్ధమత సమాజాన్ని, ముఖ్యంగా సన్యాసి సమాజాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్ లుగా విభజించి, ఒకరినొకరు అపఖ్యాతి పాలు చెయ్యడానికి మరియు దెబ్బతీయడానికి ప్రయత్నించడం చాలా వినాశకరమైనది. ఆ తర్వాత ఏదో ఒక వర్గంలో చేరి దాని విద్వేష ప్రచారంలో పాల్గొనడం కూడా చాలా హానికరం. ఏదేమైనా, ఒక గ్రూప్ వినాశకరమైన లేదా హానికరమైన పనులలో నిమగ్నమై ఉంటే, లేదా హానికరమైన క్రమశిక్షణను అనుసరిస్తే, కరుణ ఆ గ్రూప్ లో చేరడం వల్ల కలిగే ప్రమాదాలకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించడానికి పిలుపునిస్తుంది, కాని ఆ ఉద్దేశ్యం ఎప్పుడూ కోపం, ద్వేషం లేదా ప్రతీకారం లాంటి కోరికతో కలపకూడదు.

బుద్ధుని మరణం

ముక్తిని సాధించడంతో, బుద్ధుడు సాధారణ మరణాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిన అవసరం లేనప్పటికీ, 81 సంవత్సరాల వయస్సులో, బుద్ధుడు తన అనుచరులకు అశాశ్వతం గురించి బోధించి తన శరీరాన్ని విడిచిపెట్టడం ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. అలా చెయ్యడానికి ముందు, అతను తన సహాయకుడు ఆనందకు తనని ఎక్కువ కాలం జీవించమని మరియు బోధించమని చెప్పే అవకాశం ఇచ్చాడు, కాని బుద్ధుడు ఇచ్చిన ఆ సూచన ఆనందకి అర్ధం కాలేదు. ఒక బుద్ధుడు కోరినప్పుడు మాత్రమే బోధిస్తాడని, ఎవరూ అడగకపోతే లేదా ఆసక్తి చూపకపోతే, అతను అక్కడి ఏమీ చెప్పకుండా వేరే చోటుకు వెళ్తాడని, అక్కడ అతనికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఇది సూచిస్తుంది. ఉపాధ్యాయుడి ఉనికి, బోధనలు విద్యార్థులపై ఆధారపడి ఉంటాయి.

అప్పుడు కుషినగరంలో చుండ అనే భక్తుడి ఇంట్లో బుద్ధుడు తనకు, తన సన్యాసులకు ఇచ్చిన భోజనం తిని మరణాన్ని పొందే అస్వస్థతకు గురయ్యాడు. బుద్ధుడు తన మరణ బెడ్ పై తన సన్యాసులకు ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, వారు తన ధర్మ బోధనలు మరియు దాని నైతిక క్రమశిక్షణపై ఆధారపడాలని చెప్పాడు, అదే ఇప్పుడు వారికి గురువుగా ఉంది. అన్ని సమాధానాలను ఇవ్వడానికి తన దగ్గర పూర్తి అధికారం లేనందుకు, ప్రతి వ్యక్తి బోధనల నుంచే తనకు తానే సమాధానాలను వెతుక్కోవాలని బుద్ధుడు సూచించాడు. ఆ తర్వాత బుద్ధుడు కన్నుమూశాడు.

చుండ బుద్ధునికి విషం ఇచ్చాడని అనుకుని చాలా బాధ పడ్డాడు, కాని ఆనందుడు అతనిని ఓదార్చి, అతను మరణించే ముందు బుద్ధుడికి తన చివరి భోజనాన్ని పెట్టినందుకు గొప్ప సానుకూల శక్తిని లేదా "యోగ్యతను" పెంపొందించుకోమని చెప్పాడు.

ఆ తర్వాత బుద్ధుడిని పూడ్చి పెట్టారు, మరియు అతని హస్తికలను స్థూపాలు - రెలిక్వరీ స్మారక చిహ్నాలలో - ముఖ్యంగా నాలుగు ప్రధాన బౌద్ధ యాత్రా స్థలాలుగా మారే ప్రదేశాలలో ఉంచారు, అవే:

  • లుంబినీ - బుద్ధుడు జన్మించిన ప్రదేశం
  • బోధ్ గయా - బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం
  • సారనాథ్ - అతను తన మొదటి ధర్మ బోధనను ఇచ్చిన ప్రదేశం
  • కుషినగరం - అతను కన్నుమూసిన ప్రదేశం.  

సారాంశం

వివిధ బౌద్ధమత సంప్రదాయాలు బుద్ధుని జీవితం గురించి వివిధ కథనాలను బోధిస్తాయి. ప్రతి సంప్రదాయం బుద్ధుడిని ఎలా భావిస్తుందో మరియు అతని ఉదాహరణ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చో అని తేడాలు సూచిస్తాయి.

  • హినయాన రకం - ఇవి చారిత్రక బుద్ధుని గురించి మాత్రమే మాట్లాడతాయి. జ్ఞానోదయాన్ని చేరుకోవడానికి బుద్ధుడు తనపై తాను ఎలా తీవ్రంగా పనిచేసుకున్నాడో చూపించడం ద్వారా, సాధారణ ప్రజల లాగానే మనం కూడా అలాగే చెయ్యగలమని మనం అర్థం చేసుకున్నాము మరియు మనం శ్రమించడం కూడా నేర్చుకుంటాము.
  • సాధారణ మహాయాన రకం - ఇందులో బుద్ధుడు చాలా సంవత్సరాల క్రితమే జ్ఞానోదయం పొందాడు అని, 12 జ్ఞానోదయ కర్మలతో జీవితాన్ని గడపడం ద్వారా, జ్ఞానోదయం అనేది అందరి కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని ఆయన మనకు బోధిస్తాడు అని ఉంటుంది.
  • అనుత్తరయోగ తంత్ర వృత్తాంతాలు - బుద్ధుడు దూరదృష్టిపై సూత్రాలను బోధించే శాక్యమునిగా (ప్రజ్ఞాపరమిత సూత్రాలు) మరియు తంత్రాలను బోధించే వజ్రధారగా ఒకే సమయంలో అవతరించాడు. ఇది తంత్ర అభ్యాసం పూర్తిగా శూన్యత (శూన్యం) యొక్క మధ్యమాక బోధనలపై ఆధారపడి ఉందని సూచిస్తుంది. 

అందుకని, బుద్ధుని జీవితం యొక్క ప్రతి రకం నుంచి మనం అనేక ఉపయోగకరమైన విషయాలను నేర్చుకోవచ్చు మరియు అనేక విభిన్న స్థాయిలలో ప్రేరణను పొందవచ్చు.

Top