మతానికి అతీతమైన నైతిక విలువలు

రెండవ స్థాయి తేడాలకు ప్రాధాన్యత ఇస్తే కలిగే నష్టాలు

ప్రియమైన సోదర సోదరీమణులారా, మీ అందరితో ఇలా మాట్లాడే అవకాశం నాకు లభించినందుకు నేను ఏంతో సంతోషిస్తున్నాను. ముందుగా, నేను ప్రజలతో మాట్లాడేటప్పుడు, ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటాను, అది ఏమిటంటే దయచేసి మిమ్మల్ని మీరు ఒక మనిషి లాగే భావించండి. ఉదాహరణకు, "నేను స్విస్" "నేను ఇటాలియన్" లేదా "నేను ఫ్రెంచ్" అని అనుకోకండి. నా అనువాదకుడు అతను ఒక  ఫ్రెంచ్ అని అనుకోకూడదు! నేను కూడా ఒక టిబెటన్ ని అని అనుకోకూడదు. అంతేకాక, నన్ను నేను బౌద్ధుడిగా భావించుకోకూడదు, ఎందుకంటే సాధారణంగా నేను ఇచ్చే అన్ని ప్రసంగాలలో, సంతోషకరమైన, మరియు తక్కువ బాధలతో కూడిన జీవితాన్ని గడపాలంటే ఒక మనిషిగా ఉండటం వల్లే అది సాధ్యమవుతుందని నేను చెప్తూ ఉంటాను.

ఈ ఏడు బిలియన్ మానవులలో ప్రతి ఒక్కరూ తమకు ఒక సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటారు, ప్రతి ఒక్కరికి అలాంటి జీవితాన్ని పొందే అన్ని హక్కులు ఉన్నాయి. "నేను టిబెటన్" అనేటటువంటి రెండవ స్థాయి తేడాలని మాట్లాడితే, అప్పుడు నాకు టిబెట్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచనను కలిగిస్తుంది. అలాగే, "నేను బౌద్దుడిని" అనేది ఇతర బౌద్దులతో ఒక రకమైన సన్నిహిత భావాన్ని కలిగేలా చేస్తుంది, కానీ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ఇతర మతాల నుండి ఈ మాట ఒక రకమైన చిన్నపాటి దూరాన్ని సృష్టిస్తుంది. 

ఇలాంటి ఆలోచనలు నిజానికి ఎన్నో సమస్యలకు దారితీస్తాయి, అవి ఏంటంటే గతంలో మనుషులు ఎదుర్కొన్న అనేక రకమైన హింసాత్మక సమస్యలు మరియు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎదుర్కోబోయే సమస్యల లాంటివి. ఎదుటి వ్యక్తిని కూడా మీ లాగే ఒక సాధారణ మనిషిగా చూస్తే అస్సలు హింస అనేదే ఉండదు. ఒకరినొకరు చంపుకోవడానికి అవసరం ఏముంది; కానీ మనం మానవత్వం యొక్క ఏకత్వాన్ని మరచిపోయి, దానికి బదులుగా "నా దేశం", "వాళ్ల దేశం", "నా మతం", "వాళ్ల మతం" లాంటి రెండవ స్థాయి తేడాలపై దృష్టి పెట్టి, మనం అనవసరమైన భేదాలను సృష్టించుకుని మన స్వంత ప్రజలు మరియు మన మతాన్ని అనుసరించేవారి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాము. అప్పుడు, మనం ఇతరుల హక్కులను పట్టించుకోకుండా వాళ్లను అగౌరవపరుస్తూ ఉంటాము. ప్రస్తుతం మనం ఎదుర్కుంటున్న చాలా రకాల సమస్యలు ఈ రెండవ స్థాయి తేడాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్లే వస్తున్నాయి.

ఇప్పుడు, దీనికి ఏకైక పరిష్కారం ఏమిటంటే, సరిహద్దులు లేదా అడ్డంకులు చూడకుండా, మానవుల స్థాయిలో మన గురించి మనం ఆలోచించుకోవడమే. ఉదాహరణకు నేను ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు, నన్ను నేను ఒక టిబెటన్ బౌద్ధుడిగా భావించినా లేదా అంతకంటే ఎక్కువగా నన్ను నేను "దలైలామా" గా భావించినా, అప్పుడు నాకు మరియు నా ప్రేక్షకులకు మధ్య ఒక రకమైన దూరాన్ని తెచ్చిపెడుతుంది, దీనినే మూర్ఖత్వం అంటారు. మీ మంచి గురించి నేను నిజాయితీగా ఆలోచిస్తూ ఉంటే, నేను మీతో మానవ సోదర సోదరీమణులుగా, ఒక మానవుడిగానే మీతో మాట్లాడాలి. నిజానికి మానసికంగా, భావోద్వేగంగా, శారీరకంగా మనమంతా ఒక్కటే. మరీ ముఖ్యంగా, మనందరికీ ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషకరమైన జీవితం ఉండాలని కోరుకుంటాం, నేను కూడా అలాంటి వాడినే, కాబట్టి మనం ఈ స్థాయిలోనే మాట్లాడుకుందాం.

లౌకిక నైతిక విలువలు

లౌకిక నైతిక విలువలు అనేవి జీవ సంబంధిత విషయాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి, కానీ మత విశ్వాసం అనేది కేవలం మనుషులలో మాత్రమే ఉంది. మనుషులలో విశ్వాసం అభివృద్ధి చెందింది, కానీ ఇది ఖచ్చితంగా జీవ సంబంధిత విషయం అయితే కాదు. లౌకిక నైతిక విలువలు ఏడు బిలియన్ల మనుషుల జనాభాకు వర్తిస్తుంది. నిన్న నేను చెప్పినట్లుగా, ఈ ఏడు బిలియన్ల మనుషులలో, ఒక బిలియన్ మంది తాము నాస్తికులని అధికారికంగా చెప్పారు, అప్పుడు మనం ఆ విశ్వాసం ఉన్న ఆరు బిలియన్ల మంది గురించి ఆలోచిస్తే, వాళ్లలో చాలా మంది అవినీతిపరులే ఉన్నారు. కుంభకోణాలు, దోపిడీ దారులు, అవినీతిపరులు, మోసకారులు, అబద్ధాలు చెప్పేవారు, బెదిరింపులు ఇచ్చే వాళ్లే ఉన్నారు. దీనికి కారణం నైతిక విలువలపై సరైన విశ్వాసం లేకపోవడమే అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మతాన్ని కూడా తప్పుడు పనులు చెయ్యటానికి ఉపయోగిస్తున్నారు. నేను నిన్న చెప్పానో లేదో తెలీదు కానీ కొన్నిసార్లు నేను ఈ మతమే మనకు కపటంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందని నేను అనుకుంటాను. మనం "ప్రేమ" మరియు "కరుణ" అనే మంచి పదాలు వాడుతాము, కాని వాస్తవానికి మనం అలా ప్రవర్తించము, ఇంకా చాలా అన్యాయం జరుగుతూనే ఉంటుంది.

మతం అనేది ఈ మంచి విషయాలను ఒక రకమైన సాంప్రదాయ పద్ధతిలో వివరిస్తుంది, కానీ వాస్తవానికి మీ హృదయానికి కనెక్ట్ అయ్యేలా చెప్పలేదు. ఇలా ఎందుకంటే ప్రజలకు నైతిక విలువలు లేకపోవడం లేదా నైతిక విలువలపై నమ్మకం లేకపోవడం. ఒక మనిషి విశ్వాసి అయినా లేదా నాస్తికుడు అయినా, ఈ నైతిక విలువలను అతనికి ఎలా నేర్పించాలి అని మనం బాగా ఆలోచించాల్సి ఉంది. అప్పుడు, ఆ విలువలకు తోడుగా మతాన్ని పరిచయం చేయొచ్చు. అప్పుడు అది నిజమైన మతం అవుతుంది. నేను నిన్న చెప్పినట్లుగా అన్ని మతాలు ఈ విలువల గురించి మాట్లాడతాయి.

ఒకరి స్వంత ఫీల్డ్ తో అనుబంధాన్ని పెంచుకోకపోవడం

మునుపటి శతాబ్దంలో, ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు, రెండు గ్రూపులు దేవుడిని ప్రార్థిస్తున్నాయి. ఇది కష్టమైన పనే! ఈ రోజుకి కూడా మీరు కొన్నిసార్లు మతం పేరుతో గొడవలు జరగటం చూడవచ్చు, అందులో ఉండే రెండు గ్రూపులు దేవుడిని ప్రార్థిస్తాయని నేను అనుకుంటున్నాను. కొన్ని సార్లు ఇలాంటివి చూసి నేనే జోక్ గా చెప్తూ ఉంటాను, వీళ్లిద్దరి ప్రార్ధనలు విని దేవుడు అయోమయంలో పడిపోతాడని! ఈ రెండు గ్రూపులు ఆయనను ఒకే విధమైన కోరికలు కోరుతూ ఉంటే అతను ఎవరికి సహాయం చెయ్యాలో ఎలా నిర్ణయించుకోగలడు? ఇది నిజంగా ఒక కష్టమైన పనే. ఒకసారి అర్జెంటీనాలో శాస్త్రవేత్తలు, మరికొందరు మత పెద్దలతో చర్చిస్తున్నప్పుడు, అది మతాంతర సమావేశం కానప్పటికీ, నేను మతురానా అనే ఒక భౌతిక శాస్త్రవేత్తను కలిశాను. అతను స్వర్గీయ వరేలాకు గురువు మరియు నేను అతన్ని ఇంతకు ముందు స్విట్జర్లాండ్ లో, తరువాత అర్జెంటీనాలో కలిశాను. ఆ తర్వాత అతనిని కలవలేదు. అతను తన ప్రసంగంలో, ఒక భౌతిక శాస్త్రవేత్తగా తన సొంత వైజ్ఞానిక రంగంపై ఎలాంటి ఇష్టం పెంచుకోలేదని చెప్పారు. కాబట్టి ఇది నేను నేర్చుకున్న ఒక అద్భుతమైన మరియు తెలివైన విషయం.

నేను ఒక బౌద్దుడిని, కానీ నేను బౌద్ధమతం పట్ల అనుబంధాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే అనుబంధం అనేది ఒక నెగెటివ్ ఎమోషన్. మీరు దేని మీదైనా అనుబంధాన్ని పెంచుకుంటే, మీ ఆలోచన దానికి అనుగుణంగా మారుతుంది. ఒకసారి మీ మనస్సు అలా మారితే, మీరు మిగతా విషయాలను నిష్పాక్షికంగా చూడలేరు.

అందుకే చాలా సందర్భాల్లో మతం పేరుతో గొడవలకు దిగేవారికి అసలు కారణం మత విశ్వాసం కాదు, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలేనని నాకు అనిపిస్తుంది.

కానీ ఛాందసవాదులు లాంటి వాళ్ల విషయాలలో, వారు తమ స్వంత మతంతో చాలా అనుబంధాన్ని పెంచుకుంటారు ఆ కారణంగా వాళ్లు ఇతర సంప్రదాయాలలో ఉండే విలువను గ్రహించలేరు.

మతురానా మాటలు నాకు గొప్ప సలహాగా నిలిచాయి. చాలా మందిని కలిసిన తర్వాత, నేను అనేక ఇతర సంప్రదాయాలను ఆరాధిస్తాను కానీ నేను ఛాందసవాదిని లేదా మతోన్మాదిని కాదు. నేను ఒకసారి ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతంలోని లూర్ద్స్ కు వెళ్లాను. అక్కడికి నేను ఒక యాత్రికుడిగా వెళ్లి యేసుక్రీస్తు విగ్రహం ముందు కొంచెం మంచి నీళ్లను కూడా తాగాను. నేను ఆ విగ్రహం ముందు నిలబడి, శతాబ్దాలుగా ఈ ప్రదేశాన్ని సందర్శించిన లక్షలాది మంది ప్రజలు ఓదార్పు కోసం, కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారితో, వారి విశ్వాసం ద్వారా మరియు ఒక విధమైన ఆశీర్వాదంతో నయం కావడం గురించి నా మనస్సులో ఆలోచించుకున్నాను. అప్పుడు నేను ఈ క్రైస్తవ మతం పట్ల ఒక విధమైన లోతైన ప్రశంసను పొందాను. ఆ సమయంలో నా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఇంకోక రోజు, పోర్చుగల్ లోని ఫాతిమాలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. కాథలిక్, మారియు క్రైస్తవులతో నిండిన ప్రదేశంలో మేము ఒక చిన్న మేరీ విగ్రహం ముందు కొద్దిసేపు నిలబడి నిశ్శబ్దంగా ధ్యానం చేసాము. తర్వాత నేను అందరితో కలిగి వెళ్లిపోతుంటే ఒక్కసారి నేను ఎందుకో వెనక్కి తిరిగి చూసాను. అప్పుడు ఆ మేరీ విగ్రహం నిజంగా నా వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వింది. నేను మళ్లీ మళ్లీ తిరిగి చూసాను, తను అలాగే నవ్వుతూ ఉంది. మేరీకి నా నాన్ సెక్టేరియన్ పద్ధతి నచ్చిందని అనిపించింది! ఫిలాసఫీ  గురి౦చి ఇంకొన్ని విషయాలను చర్చి౦చడానికి నేను మేరీతో ఎక్కువ సమయ౦ గడిపితే, అప్పుడు ఇంకో క్లిష్టమైన సంఘటన జరిగి ఉండేది!

ఎలా అయినా, మీ మతం పట్ల బంధాన్ని కలిగి ఉండటం అనేది మంచి విషయం కాదు. కొన్నిసార్లు మతం సంఘర్షణ మరియు విభజనలకు కారణమవుతుంది. ఇది ఒక సీరియస్ విషయం. మతం అనేది కోపం మరియు ద్వేషానికి పరిహారాలు అయిన కరుణ మరియు క్షమా గుణాన్ని పెంచేందుకు ఉపయోగపడాలి. కానీ, ఒక మతం ఇతర మత విశ్వాసాల పట్ల మరింత ద్వేషాన్ని సృష్టిస్తే, ఇది అనారోగ్యాన్ని నయం చేయడానికి అవసరమైన మందు ఇంకా ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నైతిక విలువలపై నమ్మకం లేకపోవడమే ఇలాంటి వాటన్నిటికీ  కారణం, కాబట్టి నైతిక విలువలను పెంపొందించడానికి అసలైన ప్రయత్నం చేయడానికి మనకు వివిధ పద్ధతులు మరియు విషయాలను తెలుసుకోవటం అవసరం అని నేను నమ్ముతున్నాను.

లౌకికవాదం మరియు ఇతరుల పట్ల గౌరవం

ఇప్పుడు లౌకిక నైతిక విలువల గురించి మాట్లాడుకుందాం. నాకు భారత మాజీ ఉపప్రధాని అద్వానీ బాగా తెలుసు. ఒకానోక సందర్భంలో ఒక కెనడియన్ టెలివిజన్ బృందం తనను ఇంటర్వ్యూ చేసి, అందులో భారతదేశంలో విజయవంతమైన ప్రజాస్వామ్య ఆచరణకు ఆధారం ఏమిటని అడిగారని ఆయన చెప్పారు. దానికి అతను ఏమని సమాధానం ఇచ్చారంటే వేలాది సంవత్సరాలుగా ఇండియాలో ప్రజల మధ్య ఎన్ని గొడవలు లేదా భిన్నాభిప్రాయాలు ఉన్నా ఇతరులను ఎల్లప్పుడూ గౌరవించడం ముఖ్యమైన కారణం అని ఆయన చెప్పారు. సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఇండియాలో చార్వాక లేదా "నిహిలిస్ట్" ఫిలాసఫికల్‌ దృక్పథం అభివృద్ధి చెందిందని అతను నాకు చెప్పారు. ఇతర భారతీయ ఫిలాసఫికల్‌ అభిప్రాయాలను కలిగి ఉన్నవారు దానిని విమర్శించి వారి అభిప్రాయాలను ఖండించారు, కాని చార్వాక అభిప్రాయాలను కలిగి ఉన్నవారిని ఇప్పటికీ "ఋషి" అనే పిలుస్తారు. విభేదాలు, వాడి వేడి చర్చలు జరిగినా కానీ మనుషులలో ఇంకా గౌరవం ఉందనడానికి ఇదే నిదర్శనం. అంటే మనం నాస్తికులను కూడా గౌరవించాలి.

"సెక్యులరిజం" అనే పదం పట్ల నా స్నేహితులలో కొందరు క్రైస్తవులు, మరియు ముస్లింలు కొంచెం అభ్యంతరాన్ని చూపించారని నిన్న నేను చెప్పాను. ఎందుకంటే, ఫ్రెంచ్ విప్లవం లేదా బోల్షెవిక్ విప్లవం సమయంలో, మతానికి వ్యతిరేకంగా ధోరణి ఉంది. కానీ నేను మతం మరియు మత సంస్థల మధ్య ఉండే అసలైన తేడాను మీతో చెప్పాలని అనుకుంటున్నాను, ఇవి రెండు వేరు వేరు విషయాలు. వివేకవంతుడు మతానికి ఎలా వ్యతిరేకంగా ఉండగలడు? మతం అంటే ప్రేమ మరియు కరుణ, ఇలాంటి విషయాలను ఎవరూ విమర్శించలేరు. కానీ మత సంస్థలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఫ్రెంచ్ మరియు బోల్షెవిక్ విప్లవాల సమయంలో, రెండు సందర్భాల్లోనూ పాలించే వాళ్ళు నిజంగా వారి క్రింది ప్రజలను దూషించే వాళ్లు. అంతేకాక, పాలించే వాళ్లకు మత సంస్థల నుండి కూడా పూర్తి మద్దతు ఉండేది, కాబట్టి లాజికల్ గా ఆలోచిస్తే ఆ పాలించే వాళ్లకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటును పెంపొందించడానికి, మత సంస్థలకు కూడా ఇది వ్యతిరేకంగా మారింది. అందుకని, ఆ సమయంలో మతానికి లేదా దేవుడికి వ్యతిరేకంగా ఉండటానికి ఒక రకమైన ధోరణి ఉంది.

ఈ రోజుకి, టిబెటన్ బౌద్ధ సమాజంతో సహా మత సంస్థల్లో ఏదో ఒక రకమైన అన్యాయం జరిగితే, మనం దానికి వ్యతిరేకంగా ఉండాలి. రెండు సంవత్సరాల క్రితం దలైలామా టిబెటన్ల తాత్కాలిక, ఆధ్యాత్మిక నాయకుడిగా మారాలన్న నాలుగు శతాబ్దాల సంప్రదాయాన్ని నేను ఆపేశాను. నాకు నేనే, సంతోషంగా, గర్వంగా ఆ పద్ధతిని ముగించాను. అలాంటి విషయాలు వాస్తవానికి మతం లేదా ధర్మం యొక్క నిజమైన విలువను దెబ్బతీస్తాయి. కాబట్టి, మనం మత సంస్థలకు, నిజమైన మత ఆచారాలకు, మరియు సందేశాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి.

లౌకికవాదంపై భారతీయయుల అవగాహన ప్రకారం, మతం పట్ల ఎప్పుడూ నెగటివ్ భావన ఉండదు, కానీ అన్ని మతాల పట్ల మరియు నాస్తికులందరి పట్ల గౌరవం ఉంటుంది. ఇది చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. మనం దీనిని ఎలా ప్రమోట్ చేయాలి? బోధించడం ద్వారానా? కాదు. లేకపోతే ప్రార్థన ద్వారానా? కాదు. చదువు ద్వారానా? అంటే అవును అనే చెప్పాలి. మనం మన శారీరక పరిశుభ్రత గురించి అన్ని విషయాలను తెలుసుకుంటాము, అయితే మన భావోద్వేగ లేదా మానసిక పరిశుభ్రత గురించి జ్ఞానం మనం ఎందుకు తెలుసుకోకూడదు? ఆరోగ్యకరమైన మనస్సును ఎలా నిర్వహించుకోవాలి అనే దాని గురించి మనం ఎందుకు తెలుసుకోకూడదు? భగవంతుడి గురించో, మరుజన్మ గురించో, బుద్ధుని గురించో, నిర్వాణ గురించో మాట్లాడుకోనవసరం లేదు, కేవలం మన మనసుతో ఒక సంతోషకరమైన వ్యక్తిగా ఎలా ఎదగాలి అనే దాని గురించే తెలుసుకుంటే చాలు. ఒక సంతోషకరమైన వ్యక్తి సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిస్తాడు, ఇది సంతోషకరమైన సమాజాన్ని చేస్తుంది. అందుకని, మనం భావోద్వేగ పరిశుభ్రతపై గురించి కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సిన  అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.

భావోద్వేగ పరిశుభ్రత

భావోద్వేగ పరిశుభ్రత అంటే ఏమిటి? దీని అర్థం ఏమిటంటే మన ప్రశాంతమైన మనస్సును లేదా మన మనశ్శాంతికి భంగం కలిగించే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. ఇవి మానసిక అనారోగ్యం లాంటివి, ఎందుకంటే ఈ నెగెటివ్ భావోద్వేగాలు మీ ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన మనస్సును నాశనం చేయడమే కాకుండా, వాస్తవికతను నిర్ణయించే మీ మానసిక సామర్థ్యాన్ని కూడా పాడుచేస్తాయి. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు కోపంలో ఉన్నప్పుడు వాస్తవికతను చూడలేరు అప్పుడు మీ మనస్సు సరిగ్గా ఆలోచించలేదు. అలాగే అనుబంధాలతో మీరు వాస్తవికతను సరిగ్గా చూడలేరు. ఇది మనసుకు సంబంధించిన ఒక వ్యాధి. మన మనస్సు యొక్క స్వభావం. అవగాహనను కాబట్టి ఈ సామర్థ్యాన్ని తగ్గించే ఏ విషయం అయినా మనకు ఒక నెగెటివ్ విషయమే.

భావోద్వేగ పరిశుభ్రత అనేది ఈ రకమైన భావోద్వేగాలను తగ్గించడం మరియు స్పష్టత మరియు ప్రశాంతత కోసం ఒకరి ఆరోగ్యకరమైన మనస్సు కోసం మానసిక సామర్థ్యాన్ని పెంపొందించటం. ఇలా చెయ్యాలంటే ముందుగా మనం ఆ ఆలోచనల మీద ఆసక్తిని పెంపొందించుకోవాలి. ఆసక్తి లేకుండా, మీరు ఒక పనిని చేయమని ప్రజలను బలవంతం చేయలేరు. ఏ చట్టమూ, రాజ్యాంగమూ ప్రజలను ఆ పనిని చేయించలేవు. ఇది వ్యక్తిగతంగా రావాలి, అది చేస్తే వచ్చే విలువను తెలుసుకున్నప్పుడు మాత్రమే అది చెయ్యగలం. అప్పుడు మనం ఈ విలువలను ఇతరులకు బోధించగలం.

మనస్సు మరియు భావోద్వేగాలపై శాస్త్రీయ పరిశోధనలు

ఇప్పుడు మనం సైన్స్ ను చూద్దాం. ఇంతకు ముందు, మోడరన్ సైన్స్ మేటర్ పై దృష్టి పెట్టింది, ఇందులో మీరు కొలతలు తీసుకోవచ్చు. ఇరవయ్యో శతాబ్దం చివర్లో మరియు ఇప్పుడు, ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభంలో, ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మనస్సు మరియు దాని భావోద్వేగాలపై నిజంగా ఆసక్తి చూపుతున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆరోగ్యం విషయానికి వస్తే మనస్సు మరియు భావోద్వేగాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు "ఆరోగ్యకరమైన మనస్సు ఉంటే, ఆరోగ్యకరమైన శరీరం ఉంటుంది" అని చెబుతున్నారు. నిరంతర భయం, కోపం మరియు ద్వేషం వాస్తవానికి మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయని, ఇంకొక వైపు దయగల మనస్సు ముఖ్యంగా ఆరోగ్యకరమైన శరీరానికి సహాయపడుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. మానసికంగా సంతోషంగా ఉన్నవారికి, వారి శరీరంపై సానుకూల ప్రభావాలు అపారంగా ఉంటాయని మనకు తెలుసు.

కష్టతరమైన పరిస్థితుల్లో మంచిని గుర్తించడం

నా జీవితంలో, పదహారేళ్ళ వయస్సులోనే నేను చాలా బాధ్యతలు తీసుకున్నాను. అప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. తర్వాత ఇరవై నాలుగేళ్ల వయసులో, నేను నా స్వంత దేశాన్ని పోగొట్టుకుని ఇప్పుడు నా జీవితంలో ఎక్కువ భాగం ఒక శరణార్థిగా బతుకుతున్నాను. ఈ రోజుల్లో టిబెట్ లో ఎన్నో కష్టాలు, సమస్యలు వచ్చాయని, ప్రజలు నాపై ఎంతో ఆశలు, విశ్వాసం ఉంచారు. కానీ నేను ఒక నిస్సహాయుడిని. శాంతితో కూడిన నా మనస్సు వీటన్నిటినీ వాస్తవానికి దగ్గరగా చూడటానికి నన్ను అనుమతించింది. శాంతి దేవుడు చెప్పినట్లు కష్టాలను అధిగమించగలిగితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఆ కష్టాన్ని అధిగమించే అవకాశం లేని క్లిష్ట పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆందోళన చెందడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇది చాలా వాస్తవికమైన విషయం, కాబట్టి నేను ఈ విషయాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను.

విషయాలను మరింత వాస్తవికంగా చూడటం మరియు అన్ని విషయాలను రిలేటెడ్ గా ఉన్నాయని చూడటం చాలా ముఖ్యం. ఏమి జరిగినా, కొన్ని సానుకూల ప్రభావాలు ఉండవచ్చు. నా విషయంలో, నేను ఒక శరణార్థిని అయ్యాను, కానీ దీని వల్ల, నాకు చాలా మందిని కలుసుకుని అనేక విభిన్న అభిప్రాయాలను నేర్చుకునే అవకాశం లభించింది. నేను అడుక్కునే వాళ్లను, నాయకులను, వివిధ రంగాలకు చెందిన పండితులను, మరియు మత వ్యతిరేకపు మనుషులను కలిశాను. ఈ ప్రయాణం నాకు ఎంతో సహాయపడింది, ఎందుకంటే నేను టిబెట్ లోనే ఉండి ఉంటే, నా జ్ఞానం ఇప్పుడు ఉన్న దానిలో సగం మాత్రం ఉండేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక రకంగా ఇది ఒక విషాదకరమైన విషయమే అయినా మరో రకంగా ఇది నాకు చాలా మంచి పాఠాలను నేర్పించింది అని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకుంటే మనకు ఇలా జరగటం మంచిదే అని అనిపిస్తుంది. మనకు చెడు జరగొచ్చు, కానీ కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతాయి.

గతంలో టిబెట్ ప్రజలు ఒంటరిగా ఉండేవారు, కానీ ఇప్పుడు వారి ఆలోచనలు మరింత విస్తృతంగా మారాయి. శతాబ్దాలుగా, టిబిటెన్లు నిద్ర లాంటి స్థితిలో నివసిస్తున్నారు, కానీ ఇప్పుడు వారు మేల్కున్నారు. అది ఒక మంచి విషయం! కాబట్టి, మీరు ఇక్కడ గమనిస్తే కొన్ని మంచి విషయాలను కనిపెట్టవచ్చు. ఇది మన మనశ్శాంతిని కాపాడుకోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మధ్య, నా పాత స్నేహితులు చాలా మంది నేను వారిని కలిసినప్పుడు నా ముఖం ఇప్పటికీ ఎంత యవ్వనంగా కనిపిస్తుందో అని అంటూ ఉంటారు, అందులో కొందరు నా ముఖం ఇలా ఉండటానికి రహస్యాన్ని కూడా అడుగుతూ ఉంటారు. నేను వాళ్లకి రోజుకి ఎనిమిది లేదా తొమ్మిది గంటల నిద్ర సహాయపడుతుందని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నిజంగా ఇది ఒక కారణమే. కానీ మన మనస్సు మరియు మానసిక స్థితులు ఎప్పుడూ నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉంటేనే అసలైన ప్రయోజనం ఉంటుంది.

ఒక ప్రశాంతమైన మనస్సు వైద్య శస్త్రచికిత్స వంటి విషయాల నుండి కోలుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. నేను నా పిత్తాశయానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు నాకు చాలా సీరియస్ గా ఉండేది. సాధారణంగా ఈ శస్త్రచికిత్సకు కోసం పదిహేను నుండి ఇరవై నిమిషాలు సరిపోతాయి. కానీ ఆ సర్జన్ నాకు చెప్పిన విషయం ఏమిటంటే నా కేసు సీరియస్, నాకు దాదాపు మూడు గంటలు ఆ ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే నా పిత్తాశయం చాలా చీముతో కూడుకుని దాని పరిమాణానికి దాదాపు రెండు రెట్లు పెద్దగా పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత నేను ఐదు రోజుల్లోనే కోలుకున్నాను. కాబట్టి ఒక ప్రశాంతమైన మనస్సు మరియు ఆశావాద దృక్పథం నిజంగా ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. అప్పటికీ మీకు ఏదైనా అనుకోనిది జరిగినా, మీరు వెంటనే ఆ ప్రమాదం నుంచి కోలుకుంటారు. మంచి ఆరోగ్యానికి మనశ్శాంతి చాలా అవసరం.

లోపలి అందం మరియు బయటి అందం

సగం జోక్ మరియు సగం టీజింగ్ గా నేను ఇక్కడ ప్రస్తావించాను. అది ఏమిటంటే కొంతమంది అమ్మాయిలు కాస్మెటిక్స్ కోసం చాలా డబ్బులను ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది అమ్మాయిలు తమ ముఖాలపై వివిధ రంగులను ఉపయోగిస్తారు - బ్లూ, గ్రీన్ మరియు మిగతా రంగులు. ఇది చూడటానికి అంత అందంగా లేకపోయినా వాళ్లకి వాళ్లు చాలా అందంగా కనిపిస్తారు! మనుషులు బయట కనపడే అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మొన్న ఒక బహిరంగ చర్చలో, ఒక అమ్మాయికి నీలి రంగు జుట్టు ఉంది, ఇది చాలా అసాధారణమైన విషయం అనే చెప్పాలి. కాబట్టి నేను ఆమెను టీజ్ చెయ్యటానికి నీ నీలి జుట్టు అందంగా ఉండాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాను! మాములుగా బయట అందంగా ఉండటం ఒక ముఖ్యమైన విషయమే కానీ అత్యంత ముఖ్యమైనది మన లోపల ఉండే అందం. ఎవరు అయితే బయట అందంగా కనిపించటానికి ఎక్కువ డబ్బులను ఖర్చు చేస్తారో వాళ్లు దయచేసి వాళ్ల లోపల అందంపై కూడా శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది!

ఒక అకడమిక్ సబ్జెక్టుగా మనస్సు మరియు భావోద్వేగాలు

మనం శాస్త్రీయ పరిశోధనల గురించి మాట్లాడుతున్నాం. నిజమైన మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమైనది. మనశ్శాంతికి ఆధారం ఆత్మవిశ్వాసం మరియు అంతర్గత బలం, ఇది ఇతరుల పట్ల గౌరవం మరియు వారి శ్రేయస్సు పట్ల శ్రద్ధతో ప్రేమ మరియు కరుణతో ఉండటంతో వస్తుంది. ఇవే లౌకిక నైతిక విలువలు.

అంగన్ వాడీ నుంచి యూనివర్సిటీ వరకు, మనం మనస్సు గురించి మరియు మన భావోద్వేగాలను ఎలా మెయింటైన్‌ చూసుకోవాలో అనే దాని గురించి అవగాహనను కల్పించవచ్చు. ఈ సబ్జెక్టు చాలా పెద్దది, మరియు మన మనస్సు మరియు భావోద్వేగాలతో పాటు వాటి మధ్య ఉండే సంబంధం గురించి చాలా వివరణలు ఉన్నాయి. మనం ఒక రకమైన కారణం మరియు ప్రభావాన్ని చూడవచ్చు, మన మనస్సులోని ఒక భాగంలో ఏదైనా జరిగితే, ఇంకొక చోట వేరే ఏదో జరుగుతుంది. కాబట్టి దీన్ని అర్ధం చేసుకోవడానికి, మన మనస్సు మరియు పూర్తి మెదడు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న విధానాన్ని మనం బాగా తెలుసుకోవాలి.

ఈ పెద్ద సబ్జెక్టు విద్యా పరంగా చాలా విలువైనది. గత కొన్నేళ్లుగా అమెరికాలోని శాస్త్రవేత్తలు ఈ సమాచారం ఆధారంగా ప్రయోగాలు చేస్తూ కొన్ని అద్భుతమైన ఫలితాలను సాధించారు. దీని ఫలితంగా, ఇప్పుడు లౌకిక నైతిక విలువల గురించి బోధించే చదువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం సెక్యులరిజం ఆధారంగా నైతిక విలువలకు సంబంధించిన డ్రాఫ్ట్ పాఠ్యాంశాలను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము, ఇది లౌకిక విద్యా రంగంలో సరిగ్గా ఇమిడిపోతుంది.

ఇక్కడ ఉన్న ప్రేక్షకులు, ముఖ్యంగా విద్యావేత్తలు, మరియు ఆలోచనాపరులు దీని గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవకాశం మీకు లభిస్తే మీరు తప్పకుండా ఈ అంశంపై కొన్ని చర్చలను జరపండి. ప్రస్తుతం, మన విద్యా వ్యవస్థలో నైతిక విలువలపై పాఠాలు ఎక్కువగా లేవు, కాబట్టి చాలా మంది ప్రజలు ఈ జ్ఞానం కోసం మతపరమైన బోధనలపైనే ఆధారపడుతున్నారు. ఒక విధంగా ఇది కూడా మంచిదే, కానీ మతం పట్ల ఆసక్తి లేని వారు, మతపరమైన భావనలను అంగీకరించడం కష్టంగా భావించే వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లకు ఇది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి, విశ్వవ్యాప్తంగా అందరూ ఒప్పుకునే ఒక మంచి మార్గాన్ని మనం కనిపెట్టాలి.

పూర్తయింది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలను చూద్దాం.

ప్రశ్నలు

నమస్తే గురువు గారు, మీ చివరి మాటల్లోనే నేను అడగబోయే ప్రశ్న గురించి మీరు మాట్లాడారు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే దాని పూర్తి సమాధానం తెలుసుకోవటం కోసం అదే ప్రశ్నను నేను మిమ్మల్ని మళ్లీ అడగాలనుకుంటున్నాను. స్కూల్స్ మరియు యూనివర్సిటీలలో లౌకిక నైతిక విలువల బోధనకు సంబంధించి, మీరు ఎవరితోనైనా కలిసి వాటికి సంబంధించే ఏదైనా బోధనా కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మీరు పని చేస్తున్నారా? అలా చేసే ఆలోచన ఉంటే, మీకు సహాయం చేయడానికి ఏవైనా విద్యా లేదా ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చాయా?

ఇండియాలో, ఢిల్లీలోని కొన్ని యూనివర్సిటీల సహాయంతో, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా డ్రాఫ్ట్ పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి మేము ఇప్పటికే పనిని మొదలుపెట్టాము. ఆ తర్వాత మాకు మైండ్ అండ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ కూడా లిస్ట్ లో ఉంది. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, ఎమోరీ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వంటి వాటిల్లో వారి స్వంత రంగాలలో వ్యక్తిగత సభ్యులు ఇప్పటికే లౌకిక నైతిక విలువలను నేర్పిస్తున్నారు. ఈ సంస్థను మేము ఇప్పటికే యూరోప్ లో విస్తరించాము. త్వరలోనే మేము ఢిల్లీలో లేదా ఆ సిటీ సమీపంలో ఒక సంస్థను ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు దీని పైనే మేము పని చేస్తూ ఉన్నాం. పాఠ్య ప్రణాళిక సిద్ధమైన తర్వాత, మేము కొంతమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మొదలుపెడతాం. ఇది ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో.

నమస్తే గురువు గారు, నేను ఈ గ్రహాన్ని మరియు దీని మీద ఉన్న ప్రతి దాన్ని ఇష్టపడుతున్నాను, ఈ భూమిని, మొక్కలను, జంతువులను మరియు ఈ అద్భుతమైన మానవ జాతిని. కానీ ఈ మనుషులు ఎప్పుడూ ఈ గ్రహాన్ని నాశనం చేస్తూనే ఉన్నారు, ప్లాస్టిక్ బాటిల్లను కొనడం లాంటి చాలా చిన్న పనులు నుంచి అడవులను నరికివేసే పెద్ద పనుల వరకు. నాకు ఓపిక అవసరం అని తెలుసు, కానీ వీటిని చూసినప్పుడు, ఆ జీవులు చనిపోవడం మరియు అవి బాధ పడటం చూసినప్పుడు, నాకు చాలా కోపం వస్తుంది. అందుకని నేను గొడవ పడాలని అనుకుంటున్నాను. దానికోసం నా ప్రశ్న ఏమిటంటే, ఆరోగ్యకరమైన కోపం అనేది ఏమైనా ఉంటుందా? నేను ప్రేమతో కూడిన గొడవ పడగలనా?

నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కోపం అనేది ప్రేరణకు సంబంధించింది. కాబట్టి ఏదో ఒక విషయం పట్ల లేదా ఇతర వ్యక్తుల పట్ల కోపం రావటం ఒక విషయం, ద్వేషంతో ప్రేరేపించబడిన కోపం రావటం వేరే విషయం.

నమస్తే గురువు గారు, మీరు ఈ భూమి మీద ఉన్న ఆరు బిలియన్ల విశ్వాసుల గురించి, మరియు ఒక బిలియన్ నాస్తికుల గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను ఇంకొక మూడవ రకపు మనుషులను చూశాను. వాళ్ళు ఇటు మతాన్ని సరిగ్గా నమ్మకుండా, అటు నాస్తికులుగా ఉండకుండా  సంస్థాగత మతానికి అతీతంగా ఆధ్యాత్మికత కోసం వెతుకుతూ ఉన్నారు. వారికి మీరిచ్చే సలహా ఏమిటి?

చాలా స౦వత్సరాల క్రిత౦, స్టాక్‌హోమ్ లో, నేను ఒక చిన్న సమూహాన్ని కలిశాను. వారు ప్రస్తుతం ఉన్న సంప్రదాయాలు లేదా మతాలను పాటించరు, కానీ ఇప్పటికీ వాళ్లు ఏదో ఒక రకమైన ఆధ్యాత్మికతను కోరుకుంటున్నారు. అవును, అలాంటి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లను నేను కలవటం జరిగింది. కానీ మీరు ఈ "కొత్త యుగం" అని పిలిచే సమూహపు మనుషులు అక్కడక్కడా పాఠాలను తీసుకొని ఏదో ఒక పెద్ద విషయం కోసం వెతకటం అంతగా ఉపయోగకరమైనది కాదని నేను అనుకుంటున్నాను!

ఒకరి భౌతిక అవసరాలను తీర్చడమే ముఖ్యమైనది కాదు, వారి లోతైన విలువలను కనుగొనడానికి ప్రయత్నించడం చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. మన జీవితాలను విశ్లేషించుకోవడం, మన సంతోషం ఏదో ఇంద్రియ తృప్తి నుంచి పొందకూడదని తెలుసుకోవటం మనకే మంచిది. ఎలాగంటే, సంగీతం ప్లే అవుతున్నప్పుడు మీ మనస్సు సంతృప్తిగా ఉంటుంది కానీ అదే సంగీతం ఆగిపోతే మీకు ఏ తృప్తి ఉండదు. మానసిక స్థాయిలో, అపారమైన విశ్వాసం లేదా కరుణను కలిగి ఉండటంతో - దీని నుండి వచ్చే సంతృప్తి చాలా ఎక్కువ కాలం ఉంటుంది.

మీ దృష్టిలో మనిషికి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటి?

మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటని నన్ను ఎవరైనా అడిగితే నేను ఒక మంచి సంతోషకరమైన జీవితాన్ని గడపడమే అని అందరికి చెప్తూ ఉంటాను. ఈ సంతోషం లేదా ఆనందాన్ని పొందడానికి, అది ఇంద్రియ సామర్థ్యాలు మరియు అనుభవాలపై ఆధారపడి ఉండకూడదు, ఇది మన మానసిక స్థితిపై ఆధారపడి ఉండాలి. కాబట్టి మన అంతర్గత విలువలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. అందరికి ధన్యవాదాలు.

Top